Donald Trump: ట్రంప్‌ ఫ్లోరిడా ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సోదాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడా ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ రహస్య పత్రాలను ఇక్కడికి తరలించారేమో అనే అనుమానంతో సోదాలు చేశారు. అయితే, వీటిని అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 08:17 PM IST

Washington: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడా ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ రహస్య పత్రాలను ఇక్కడికి తరలించారేమో అనే అనుమానంతో సోదాలు చేశారు. అయితే, వీటిని అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు కానీ, ట్రంప్‌ , ఆయన కుటుంబ సభ్యులు సోదాలు నిర్వహించారని చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడి ఇల్లు సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది రక్షణలో ఉంటుంది. తనిఖీలకు కొద్ది సమయం ముందు సోమవారం ఎఫ్‌బీఐ సిబ్బంది. సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులకు వారెంట్‌ విషయం తెలియజేశారు. దీంతో వారు వారెంట్లను పరిశీలించి అనుమతించారు.

దీనిపై ట్రంప్‌ కుమారుడు ఎరిక్‌ ఓ న్యూస్‌ ఏజెన్సీతో మాట్లాడారు. ‘‘ఒక్కసారిగా 30 మంది సిబ్బంది మార్‌-ఎ-లాగోకు వచ్చారు. వీరు స్థానిక ఎఫ్‌బీఐ కార్యాలయం నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చారో మీరు అర్థం చేసుకొంటారనుకుంటున్నాను. వైట్‌ హౌస్‌ నుంచి వారు వచ్చారు. బైడెన్‌కు ముప్పుగా భావిస్తున్న ట్రంప్‌పై దాడికి వచ్చారు’’ అని పేర్కొన్నారు. చాలా రోజుల నుంచి ట్రంప్‌ ఈ దర్యాప్తునకు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ట్రంప్‌ ఇంటి నుంచి 15 బాక్సుల్లో పత్రాలు దొరికినట్లు వచ్చిన వార్త పై ఎరిక్‌ స్పందించారు వైట్‌హౌజ్‌ ఖాళీ చేసేందుకు కేవలం ఆరు గంటల సమయం మాత్రమే ఉంటుందన్నారు. ఆ సమయంలో ట్రంప్‌ వద్ద ఉన్న క్లిప్పింగ్‌లను భద్రపర్చారని, అవే ఆ పెట్టెలని వివరించారు ఎరిక్‌.

మార్‌-ఎ-లాగో తనిఖీలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ తనదైన శైలిలో స్పందించారు. మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌ను ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆక్రమించుకొన్నారని మండిపడ్డారు. ఇది దేశానికి చీకటి రోజు అని ఆయన అభివర్ణించారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నా, అనవసరంగా దాడులు నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ 2024లో మూడోసారి అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు జరగడం కాస్తా ఇబ్బందికర పరిణామమే. ఈ దాడులు జరుగుతున్న సమయంలో ట్రంప్‌ న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్స్‌లో సేద తీరుతున్నారు. ఇదిలా ఉండగా మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌ను ట్రంప్‌ 1985లో 10 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. 2018 నాటికి దీని విలువ 180 మిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. చాలా ఏళ్లుగా ట్రంప్ శీతాకాలంలో ఇక్కడ గడిపేందుకు వస్తుంటారు. ఇక్కడ ఉన్న గోల్ఫ్‌క్లబ్‌లో ఎక్స్‌క్లూజివ్‌ సభ్యత్వం కావాలంటే రెండు లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అదే వార్షిక సభ్యత్వం అయితే 14 వేల డాలర్లు. 20 ఎకరాల్లో విస్తరించిన ఈ ఎస్టేట్‌లో ట్రంప్‌ కుటుంబం కోసం ప్రైవేటుగా కొన్ని భవనాలను కేటాయించారు.