Site icon Prime9

Sukhbir Badal: మాజీ డిప్యూటీ సీఎంకు అకాల్ తఖ్త్ – స్వర్ణ దేవాలయంలో శిక్ష అమలు

Sukhbir Singh Badal Punishment: సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్‌ సోమవారం కీలక తీర్పును వెల్లడించింది. మతపరమైన, రాజకీయ పరమైన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు గానూ పంజాబ్‌ మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్‌ పార్టీ నేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌కు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంతో పాటు ఇతర గురుద్వారాల్లో బూట్లు, పాత్రలు శుభ్రం చేయాలని ఆదేశించింది. అలాగే శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్‌గా ఉన్న ఆయన రాజీనామా చేసి ఆరు నెలల్లోగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని పేర్కొంది.

ఇదీ ఆరోపణ..

గతంలో పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన కొన్నిమతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు వారి ప్రభుత్వం కొన్ని రాజకీయ పరమైన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్‌ సోమవారం నాటి సమావేశంలో నిర్ధారించింది. ఈ విషయంలో పార్టీ చీఫ్‌ సుఖ్‌బీర్‌ను దోషిగా తేల్చింది. ముఖ్యంగా 2015లో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు అనుకూలంగా సుఖ్‌బీర్ బాదల్‌ వ్యవహరించారని, ఒక కార్యక్రమంలో రామ్ రహీమ్ సిక్కుల వేషధారణలో పంజాబ్‌లో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించటంపై అకాల్ తఖ్త్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

తీర్పు ఇదే..

‘వీల్‌చైర్‌లో ఉన్నప్పటికీ సుఖ్‌బీర్ బాదల్, నాటి ప్రధాన కమిటీ సభ్యులు,2015లో నాటి పంజాబ్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారంతా మంగళవారం( డిసెంబర్ 3) మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంటల వరకు అమృత్‌సర్ స్వర్ణ దేవాలయానికి వచ్చే భక్తుల పాదరక్షలు శుభ్రంచేయాలి. అనంతరం వంటపాత్రలు కడగాలి. బాత్‌రూమ్‌లను కూడా శుభ్రం చేయాలి. ఆ తర్వాత స్నానం చేసి వంటల గదికి వెళ్లి.. భక్తులకు భోజనం వడ్డించాలి’అని కమిటీ తీర్పుచెప్పింది. అలాగే, సుఖ్‌బీర్ సింగ్ తండ్రి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ప్రకాష్ సింగ్ బాదల్, సమాజానికి చేసిన సేవలకు గాను 2011లో అతనికి ఇచ్చిన ఫఖర్-ఎ-కౌమ్ (సిక్కు సమాజానికి గర్వకారణం) గౌరవాన్ని కూడా తొలగిస్తున్నట్లు కూడా అకాల్ తఖ్త్ ప్రకటించింది. కాగా, తాను చేసిన తప్పులను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని, తన విషయంలో అకాల్ తఖ్త్ చేసిన నిర్ణయాన్ని శిరసావహిస్తానని సుఖ్‌బీర్‌ సింగ్ ప్రకటించటమే గాక తాను చేసిన తప్పులకు సిక్కు సమాజానికి బేషరతు క్షమాపణలు చెప్పారు.

Exit mobile version