Donald Trump: అగ్ర దేశం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారొల్ ను ట్రంప్ లైంగికంగా వేధించాడని న్యూయార్క్ జ్యూరీ తేల్చింది. దీంతో కాలమిస్ట్ కు 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 41 కోట్లు) పరిహారంగా చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని అనుకుంటున్న ట్రంప్‌కు ఇది పెద్ద షాక్.
ఆరోపణలివే..(Donald Trump)
‘1996లో మాన్‍హట్టన్ లోని ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ లో కారొల్ కు ట్రంప్ ఎదురయ్యారు. ఇంకో మహిళకు లొ దుస్తులను బహుమతిగా ఇచ్చేందుకు తనను సలహా అడిగారు. ట్రంప్ సరదాగా అడగడంతో అంగీకరించి ఆమె ఆరో ప్లోర్ లోకి వెళ్లారు. ఆ సమయంలో ఆ సెక్షన్ లో ఎవరూ లేకపోవడంతో దుస్తులు మార్చుకునే గదిలోకి వచ్చిన ట్రంప్.. కారొల్ పై లైంగిక దాడికి పాల్పడ్డారు.’ 2019లో ఓసారి తన గురించి అసభ్యంగా మాట్లాడి ప్రతిష్ఠకు భంగం కలిగించారని కారొల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ట్రంప్‌పై భయంతోనే తాను 20 ఏళ్లకు పైగా జరిగిన విషయంపై బహిరంగంగా మాట్లాడలేకపోయానని ఆమె చెప్పారు.
ఈ ఆరోపణలపై జ్యూరీ విచారణ జరపడంతో ట్రంప్ దోషిగా తేలారు. అయితే ట్రంప్‌పై చేసిన అత్యాచారం ఆరోపణల్లో మాత్రం వాస్తవం లేదని జ్యూరీ స్పష్టం చేసింది. కానీ జీన్ కారోల్ చేసిన ఇతర ఆరోపణలు నిజమేనని చెప్పింది. దీంతో ఆమెకు పరిహారంగా రూ. 41 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
ఫైర్ అయిన ట్రంప్
అయితే జ్యూరీ ఇచ్చిన తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ తీర్పు చాలా అవమానకరంగా ఉందని మండిపడ్డారు. తనను ఓ మంత్రగత్తె వెంటాడుతోందని లైంగిక ఆరోపణలు చేసిన కాలమిస్ట్ పై ఆయన ఫైర్ అయ్యారు. ఆసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని మరోమారు చెప్పారు. ఈమేరకు తన ‘ట్రూత్ సోషల్’ అకౌంట్ వేదికగా తెలిపారు.