Site icon Prime9

Ugadi 2023 : ఉగాది పండుగ.. ఉగాది పచ్చడి.. స్పెషల్ స్టోరీ..

devotional about udadi 2023 special story

devotional about udadi 2023 special story

Ugadi 2023 : హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో ‘గుడిపాడ్వా’ పేరుతో పిలుస్తారు. తమిళులు “పుత్తాండు” అనే పేరుతో, మలయాళీలు “విషు” అనే పేరుతోను, సిక్కులు “వైశాఖీ” గానూ, బెంగాలీలు “పొయ్‌లా బైశాఖ్” గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరం లోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాయాలను, స్ధూలంగా తమ భావిజీవిత క్రమం తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టత చూపుతారు.ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది.రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ ఉగాది-పర్వదినం.

ఉగాది పండుగతో గొప్ప వసంత రుతువు ఆగమం ప్రారంభం అవుతుంది. ఉగస్య ఆది అనేదే ఉగాది. “ఉగ” అనగా నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది – వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.

కాగా వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారిధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుప బడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’ అని ప్రసిద్ది.

ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.  తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.

“ఉగాది పచ్చడి” ప్రాముఖ్యత (Ugadi 2023)..

“ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది. అత్యంత ముఖ్యమైనది. షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఇలా ఈ షడ్రుచుల మేళవింపుగా ఉన్న ఈ పచ్చడి తింటే చక్కటి ఆరోగ్యంతో ఉంటారు.

Exit mobile version