Deputy Mayor Election in Tirupati: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపగా.. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. అయితే ఈ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు సోమవారం జరగాల్సి ఉండగా.. కోరం 50 శాతం లేకపోవడంతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
తిరుపతి కార్పొరేషన్‌లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతం 47 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు.
అయితే మొత్తం ఈ కార్పొరేషన్‌లో ఉన్న 50 మంది సభ్యులకుగానూ కోరం 50 శాతం ఉండాలి. మొత్తం సభ్యులకు గానూ సగం మంది అంటే 25 మంది హాజరు కావాల్సి ఉంది. కానీ సోమవారం జరిగిన భేటీకి 22 మంది మాత్రమే హాజరుకావడంతో ఎన్నికను వాయిదా వేశారు.
అలాగే, నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి, పదో వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణ కుమారి ఎన్నికయ్యారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలు చూచించిన అభ్యర్థులను కాదని ఈమెకు పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది.