Deputy CM Pawan Kalyan Visit Guntur Tour: పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచే అంశాన్ని పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లాలోని నంబూరులో పర్యటించారు. అనంతరం నంబూరులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పారిశుద్ధ కార్మికులకు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం కూటమి ప్రభుత్వమే చెల్లించిందని పవన్ తెలిపారు.
కృష్ణానదీ వరదల సమయంలో ప్రజలకు సాయంగా నిలబడిన దాదాపు 35 మంది పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. జీతాలు పెంచాలనే అభ్యర్థన తన దృష్టికి ఎమ్మార్వో తదితర అధికారులు తన దృష్టికి వచ్చిందని, కచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం పారిశుద్ధ్య తరలింపు వాహనాలను పవన్ కల్యాణ్ జెండా ఊపి ప్రారంభించారు.
పరిశుభ్రత కల్చర్ కావాలనేది సీఎం ఆలోచన అని వివరించారు. ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించేలా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరిశుభ్రత ఒక్కరి వల్ల సాధ్యం కాదని, అందరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత తేలికైన విషయం కాదని, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వివరించారు.