Deputy CM Pawan Kalyan speech at game changer event: సినిమా టికెట్ ధరల పెంపుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. డిమాండ్, సప్లై ఆధారంగానే టికెట్ ధరలు పెంచినట్లు తెలిపారు. అయితే వకీల్‌సాబ్ మూవీ డబ్బుతోనే జనసేన పార్టీ నడిపానని, పార్టీ నడిపేందుకు ఇంధనంలా ఉపయోగపడిందని చెప్పారు.
గతంలో నేను శంకర్ సినిమాను బ్లాక్‌లో టికెట్ కొని చూశానని, బ్లాక్‌లో టికెట్ కొనడంతో ఆ డబ్బు వేరేవాళ్లకు వెళ్తుందన్నారు. ప్రభుత్వం టికెట్ ధరలు ఊరికే పెంచడం లేదని, టికెట్ ధరలు పెంచడంతో టికెట్‌పై జీఎస్టీ కడతారన్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు.
నా సినిమా బీమ్లానాయక్‌కు టికెట్ ధరలు పెంచలేదని, కానీ మేము అలా చేయలేదన్నారు. సినిమా పరిశ్రమ బాగా ఉండాలని, సినిమా పరిశ్రమకు రాజకీయ రంగు వేయడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఇష్టం లేదని స్పష్టం చేశారు.
టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇవన్నీ కాదని.. దేశంలో ఉన్నది ఒక్కటే.. అది భారతీయ సినీ పరిశ్రమ అంతే అన్నారు. సినిమా పరిశ్రమలో క్రమశిక్షణ రావాలని, తెలుగు సినిమాపై మాట్లాడాలంటే తప్పనిసరిగా సినిమాలు తీసే వాళ్లే మాట్లాడాలని చెప్పారు. సినిమా కష్టం తెలిసిన వాళ్లతోనే మాట్లాడుతామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నుంచే ఈ ఔన్నత్యం పాటిస్తున్నామని, అందుకే సినిమాపై ఎన్డీఏకు గౌరవం ఉందని వెల్లడించారు. సినిమాలో మంచి తో పాటు చెడు కూడా చూపిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ విలువలు నేర్చుకోవాలన్నారు.