Site icon Prime9

Cyclone Fengal: ఏపీకి వరద ముప్పు.. పలు విమాన సర్వీసుల రద్దు

Heavy Rains In Andhra Pradesh: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెంగల్‌ తుఫాన్ గా మారింది. గంటకు 12 కిమీ వేగంతో తుఫాన్ పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాన్ గా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

ఆ జిల్లాల్లో తీవ్ర ప్రభావం
తుఫాన్ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వరదలకు అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. తిరుమలలోని పాపవినాశనం, శ్రీవారి పాదాలు మార్గాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కొండచరియలు, వృక్షాలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.

విమానాల రాకపోకలు బంద్..
తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖ నుంచి చెన్నై వెళ్లే పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. చెన్నై-విశాఖ – చెన్నై, తిరుపతి – విశాఖ – తిరుపతి విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 3 విమానాలు, చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన 3 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన 7 విమానాలు రద్దు చేశారు.

తెలంగాణలో వర్ష సూచన…
ఫెంగల్ తుపాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకువర్షాలు కూరిసే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగండం ఫెంగల్ తుఫానుగా మారి మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో నేడు వర్షాలు కురవనున్నాయి. నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Exit mobile version
Skip to toolbar