Congress Working Committee met in Delhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఈవీఎంలపై చర్చింనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాగా.. మరో రెండు రాష్ట్రాల్లోె ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్ ఢిల్లీ వెళ్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యంపై నేతలు చర్చించనున్నారు. అలాగే ఉప ఎన్నికల్లో పార్టీ ప్రభావంపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులతోపాటు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. దీంతో పాటు వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపైనా చర్చించనున్నారు. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల నుంచి దామోదర, వంశీచంద్, రగువీరా, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డి, గిడుగు రుద్రరాజు, పళ్లంరాజు హాజరుకానున్నారు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు.