Site icon Prime9

CM Revanth Reddy: పాలమూరును ఎవడో దత్తత తీసుకునుడేంది? ..రైతు పండుగ సభలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy speech in the Praja Palana Vijayostsavalu at Mahabubnagar: రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసునని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడవద్దని అన్నారు. నల్లమల బిడ్డగా అభివృద్ధిని అడ్డుకునే శక్తుల మీద పోరాటం చేస్తానని శపథం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని అమిస్తాపూర్2లో నిర్వహించిన రైతు పండగ సభలో సీఎం ప్రసంగించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు తీరలేదన్నారు.

మన జిల్లా పూచీ మనదే..
గతంలో ఎవడెవడో వచ్చి, పాలమూరును దత్తత తీసుకున్నట్లు గప్పాలు కొట్టుకున్నారని, ఇప్పుడు ఆ అవసరం లేదని సీఎం అన్నారు. 70 ఏళ్ల క్రితం బూర్గుల రామకృష్ణారావు జిల్లా నుంచి సీఎం కాగా, ఇప్పుడు తనకు సీఎంగా ప్రజలు అవకాశమిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇక పాలమూరు జిల్లాను మనమే అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు దుర్వినియోగం చేసుకోవద్దని చెప్పారు. సరిగ్గా గత ఏడాది నవంబరు 29న ప్రజాప్రభుత్వం కోసం ఉత్సాహంగా ఓట్లు వేసి, నియంతను ఇంటికి పంపారని గుర్తుచేశారు.

రైతులను రెచ్చగొట్టారు..
లగచర్లలో అభివృద్ధి జరుగుతుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోయారని సీఎం మండిపడ్డారు. నిర్వాసితుల మీద కపటప్రేమ చూపించి రభస చేశారని, అయినా, కొడంగల్ లో పారిశ్రామిక వాడను తీసుకొచ్చి తీరుతానని చెప్పారు. పనిచేయడమే తప్ప.. గొప్పలు చెప్పుకోవడం పాలమూరు ప్రజలకు తెలియదని, ఏడాది కాలంలో రైతులకు 54 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. పాలమూరు బిడ్డలు, రైతులే తమ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లని చెప్పారు. లగచర్లలోని 1300 ఎకరాలకు ఎకరాకు 20 లక్షల చొప్పున ఇవ్వటమే గాక ప్రతీ రైతు కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సంచలన హామీ ఇచ్చారు.

వలసల పాపం వారిదే..
కేసీఆర్ ప్రభుత్వ హాయాంలోనే పాలమూరులో వలసలు పెరిగాయని సీఎం మండిపడ్డారు. కానీ, కాంగ్రెస్ మాత్రం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు పనిచేస్తోందని గుర్తుచేశారు. పాలమూరు జిల్లాకు ఈ ఐదేండ్లలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెడతామని చెప్పారు. అవసరమైతే నిర్వాసితులకు 20 లక్షల పరిహారం ఇస్తామన్నారు.

10 నెలల్లో పాతిక లక్షల రైతులకు మాఫీ..
దేశంలో ఏ రాష్ట్రంలోనూ 10 నెలల్లో 25 లక్షల రైతులకు రుణమాఫీ చేయలేకపోయిందని సీఎం గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రధాని, కేసీఆర్‌లతోనైనా చర్చకు సిద్ధమేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్‌ను అమ్మి రుణమాఫీ చేసిందని, అదీ రూ.11 వేల కోట్లే అని ఎద్దేవా చేశారు. తాము తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఇకపై ఏటా జిల్లా అభివృద్ధికి రూ.20వేల కోట్లు కేటాయిస్తామని కీలక ప్రకటన చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దన్నారు.

ప్రాజెక్టుల పూచీ మాదే: భట్టి విక్రమార్క
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో వచ్చిన తెలంగాణను పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం దోచేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. గత పదేళ్లలో రైతుల కోసం గులాబీ పార్టీ చేసిందేమీ లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల, కోయిల్‌సాగర్‌, బీమా వంటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే అని గుర్తుచేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే పూచీ తమదేనని హామీ ఇచ్చారు. వీటిపై ప్రతినెలా సమీక్షలు చేస్తూ బిల్లులు చెల్లిస్తూ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్నారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం పనికి రాకుండా పోవటం వెనక గులాబీ నేతల ధనదాహం ఉందన్నారు.

Exit mobile version