CM Revanth Reddy Powerful Speech about hyderabad: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూయార్క్, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు రూ.7వేల కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఎస్‌టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో సీఎం మాట్లాడారు.
మెట్రో మా ఘనతే
ప్రజాపాలన ప్రారంభమైన గంటల వ్యవధిలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని పెంచినట్లు సీఎం రేవంత్ గుర్తుచేశారు. మెట్రోను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్ర ఆదాయంలో 60శాతం హైదరాబాద్, రంగారెడ్డి నుంచే వస్తోందని గుర్తుచేశారు. రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణకే మణిహారమని, రూ.35వేల కోట్లతో 360 కి.మీ మేర రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ను, ఓఆర్ఆర్‌కు అనుబంధంగా ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్నారు. రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ అద్భుత నగరం అవుతుందని సీఎం తెలిపారు.
ఇదీ మా పనితనం
నగర అభివృద్ధికి నాడు చేసిందేమీ లేదన్నారు. ఢిల్లీ మొదలు పలు నగరాలు కాలుష్యం బారిన పడ్డాయని, హైదరాబాద్‌కు ఆ గతి పట్టకూడదనే మూసీ ప్రక్షాళన చేస్తున్నామన్నారు. 10లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసేలా నగరంలో హార్వెస్టింగ్ బావులను నిర్మిస్తున్నామని, అక్రమ నిర్మాణాల మీదనే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తమ హయాంలో రాజధాని స్థిరాస్తి వ్యాపారం 29శాతం మేర పెరిగిందన్నారు. మూసీ పునరుజ్జీవనం చేయకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాటు నాటి సీఎం కేసీఆర్ అబద్ధాలతో గడిపేశారని, పాతబస్తీని ఇస్తాంబుల్ చేశామని గొప్పలు చెప్పుకున్నారన్నారు.
కిషన్.. నిధులేవీ?
మూసీని బాగుచేసే ప్రణాళికను కిషన్ రెడ్డి అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్రమంత్రిగా పావలా నిధులకు కూడా ఆయన తీసుకురాలేకపోయారని సీఎం మండి పడ్డారు. నిజంగా కిషన్ రెడ్డికి మూసీ ప్రక్షాళన మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సీఎం డిమాండ్ చేశారు. మెట్రోకు రూ.35వేల కోట్లు, రీజినల్ రింగ్ రోడ్డుకు రూ.35 వేల కోట్లు అవసరం అవుతాయని, ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. గుజరాత్‌కు మోడీ నిధులు తీసుకెళ్తుంటే కిషన్ రెడ్డి చూస్తున్నారని, ఈయన నిధులతో తెలంగాణ వస్తారా లేక తానూ గుజరాత్ వలస పోతారో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని సీఎం వ్యాఖ్యానించారు.
నగరంలో పలు శంకుస్థాపనలు
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌అర్బన్ డెవెలప్మెంట్ విభాగం పరిధిలో రూ.5827 కోట్లతో చేపడుతున్నఅభివృద్ధి పనులను వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు. ఇందులో (జీహెచ్ఎంసీ) పరిధిలో హెచ్ సీఐటీఐ ఫేజ్-1 లో రూ.3446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. సిటీలో వరద నీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు రూ.17 కోట్ల అంచనాలతో చేపట్టే పనులను ప్రారంభించారు. జల మండలినిర్మించిన మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లును ప్రారంభించారు. రూ.45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను సీఎం ప్రారంభించగా, రూ.1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు పెండింగ్ లో ఉన్న పనులకు శంకుస్థాపన చేశారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు.
అయ్య పేరు చెప్పుకుని రాలే..
హైదరాబాద్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సబ్‌కమిటీలో సభ్యులుగా ఉంటారని, తమది ప్రజా ప్రభుత్వమన్నారు. ప్రతిపక్షాల సలహాలు స్వీకరిస్తామన్నారు. మేధావులు కూడా రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపాదనలు చేయాలన్నారు. సహేతుకంగా ఉంటే అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఏం చేసినా అడ్డుకుంటామంటే అంగీకరించమన్నారు. తాత పేరో.. నాన్న పేరో చెప్పి కుర్చీలో కూర్చోలేదన్నారు. అభివృద్ధిని అడ్డుకునేవాళ్లను ఎలా ఆపాలో మాకు తెలుసన్నారు.
మూసీపై ముందుకే : భట్టి
తెలంగాణకు హైదరాబాద్ తలమానికమని, అందుకే మూసీ పునరుజ్జీవనం చేపట్టినట్లు తెలిపారు. మూసీ పరివాహక ప్రజలు అభివృద్ధి చెందకూడదని బీఆర్ ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమన్నారు. హైదరాబాద్‌లో 400 మురికి వాడలు ఉన్నాయని భట్టి తెలిపారు.