CM Revanth Reddy Met with Wipro Executive Chairman in Davos: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా, తెలంగాణ పెవిలియన్‌లో విప్రో ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు, అనంతరం హైదరాబాద్‌లో కొత్త విప్రో సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు విప్రో ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ ప్రకటించారు.
హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌ను విస్తరించనున్నట్లు విప్రో ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ చెప్పారు. కాగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్త ఐటీ సెంటర్‌ను నెలకొల్పుతామని దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ కొత్త కంపెనీ ద్వారా దాదాపు మరో 5వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. హైదరాబాద్‌లో ఐటీ రంగం వృద్ధిలో విప్రో కీలక భాగస్వామి అని, క్యాంపస్ విస్తరణతో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
అలాగే, దావోస్ పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఒప్పందాలు చేసుకున్నారు. తెలంగాణలో రూ. 800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. యూఎస్ కు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా దాదాపు 200 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. అయితే రక్షణ రంగంలో అత్యాధునిక టెక్నాలజీతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇండస్ట్రిల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు తదితరులు విదేశీ కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన నేటితో ముగియనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత జ్యూరిచ్ నుంచి దుబాయ్ చేరుకుంటారు. అనంతరం రేపు ఉదయం 8 గంటల వరకు తిరిగి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.