CM Revanth Reddy Introduced Caste Census Servey in Telangana Assembly Session: కులగణన, ఎస్సీ వర్గీవరణ నివేదికలపై తీర్మానానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ రెండు నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఈ మేరకు కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సర్వే చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించామని రేవంత్ రెడ్డి తెలిపారు.
వివిధ రాష్ట్రాల సర్వేలను అధ్యయనం చేశామని, 75 అంశాలు ప్రాతిపదికగా నవంబర్ 9 నుంచి 50 రోజుల పాటు సర్వే నిర్వహించామన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా సర్వే చేపట్టామన్నారు. సర్వే చేసే ముందు అధికారులు పలు రాష్ట్రాల్లో పర్యటించారన్నారు. ఆయా రాష్ట్రాల్లో లోటుపాట్లను గుర్తించి సరిచేసినట్లు తెలిపారు. సర్వేపై 12 సార్లు సమీక్ష నిర్వహించి పకడ్బందీగా రూపొందించామన్నారు.
ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా గుర్తించి సర్వే చేపట్టామని, అన్ని శాఖల సిబ్బందిని సర్వేలో భాగస్వాములను చేశామని చెప్పారు. తొలుత స్టిక్కర్ అంటించి సర్వే చేయాల్సిన ఇళ్లను గుర్తించామని, ఆ తర్వాత ఇళ్లకు వెళ్లి సిబ్బంది సర్వే చేపట్టారన్నారు. అన్ని శాఖల సిబ్బందిని సర్వేలో భాగస్వాములను చేశామన్నారు. సర్వేలో పాల్గొనే సిబ్బందికి అనేకసార్లు శిక్షణ ఇచ్చామని తెలిపారు.
సమాజ అభివృద్ధికి ఈ సర్వే ఓ మార్గదర్శిగా మారుతుందన్నారు. సర్వేకు చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్‌లో పెట్టి ఆమోదించామన్నారు. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనగా.. సర్వే ప్రకారం బీసీ జనాభా 46.25శాతం, ఓసీ జనాభా 17.79 శాతం, ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, బీసీ మైనార్టీలు 10.08 శాతం ఉందన్నారు. సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను సభలో ప్రవేశపెడుతున్నామన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కోసం సర్వేను చేపట్టామన్నారు. కాగా, మండలిలో కులగణన సర్వే నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.