Missing Case : హైదరాబాద్‌లో చిన్నారుల వరుస మిస్సింగ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో నగరంలో భయానక వాతావరణం నెలకొంటుంది. ఇటీవలే హైదరాబాద్‌లో మరో బాలిక అదృశ్యమైన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇటీవల దమ్మాయిగూడలో కనిపించకుండా పోయిన చిన్నారి ఇందు చెరువులో విగతజీవిగా కనిపించిన ఘటన మరువక ముందే నగరంలో పాతబస్తీ లో నసీర్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ ఘటనలో బాలుడి ఆచూకీ ఇంకా లభించకపోవడం గమనార్హం. నగరంలో జరుగుతున్న చిన్నారుల వరుస మిస్సింగ్‌లు తల్లిదండ్రులను ప్రస్తుతం ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌లోని కవాడిగూడకు చెందిన 13 ఏళ్ల బాలిక అదృశ్య ఘటన మరింత కలకలం రేపుతోంది. 27 వ తేదీన తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లడంతో… బాలిక ఒంటరిగా ఇంట్లోనే ఉంటుంది. ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మధ్యాహ్నం 12 గంటలకు తండ్రి ఆఫీస్ నుంచి ఫోన్ చేయగా.. బాలిక ఎంతసేపటికీ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానంతో తండ్రి హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా… కూతురు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల నుంచి బాలిక వివరాలు సేకరించి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య బాలిక ఫోన్ సిగ్నల్స్ నాగోల్ సమీపంలోని స్నేహపురి కాలనీలో చూపించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతంలో చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాలిక ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నా కూడా బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంట్లో నుంచి బయటికి వచ్చిన బాలిక ఆటోలో వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఆటో నెంబర్ ఆధారంగా బాలికను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వరుస మిస్సింగ్ కేసులు సహజంగా జరుగుతున్నాయా? లేదా వీటి వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.