Pradeep Dada : చిత్ర పరిశ్రమను వరుస విషాదలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని వీడి శోకాన్ని మిగిల్చారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ప్రదీప్ సర్కార్ మరణించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 68 సంవత్సరాలు. కాగా ఆయన ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రదీప్ మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
గత కొంత కాలంగా ప్రదీప్ సర్కార్ మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే సడెన్ గా శరీరంలో పొటాసియం స్థాయులు పడిపోవడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స తీసుకుంటూ ప్రదీప్ తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ సర్కార్ మృతి విషయాన్ని నటి నీతూ చంద్ర ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రియమైన దర్శకుడు ప్రదీప్ సర్కార్ దాదా మృతి తనను బాధించిందని పేర్కొన్నారు. తన సినీ కెరియర్ ఆయన సినిమాతోనే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. ప్రదీప్ మృతి విషయాన్ని ఆయన సోదరి మాధురి కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన మరణ వార్త తెలిసి బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రదీప్ దాదా మృతిని జీర్ణించుకోలేకపోతున్నాననంటూ బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విదు వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ లో రైటర్ గా వర్క్ చేసిన ప్రదీప్ సర్కార్ మొదటిసారి మున్నాభాయ్ MBBS సినిమాకి ఎడిటర్ గా వర్క్ చేసాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారిన ప్రదీప్ సర్కార్, 2005లో దర్శకుడిగా మరి ‘పరిణీత’ సినిమా తెరకెక్కించాడు. ఈ మూవీ మ్యూజికల్ హిట్ అయ్యింది కానీ బాక్సాఫీస్ దగ్గర సో సో గానే ఆడింది. 2005 నుంచి 2010 వరకూ ‘లగా చునేరి మే దాగ్’, ‘లఫంగే పరిందే’ సినిమాలని చేసాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. దీంతో ప్రదీప్ సర్కార్ నాలుగేళ్ల గ్యాప్ తీసుకోని 2014లో ‘మర్ధాని’ సినిమా చేసాడు.
రాణీ ముఖర్జీ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యి కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా మంచి పేరు తెచ్చింది. ఇక్కడి నుంచి ప్రదీప్ సర్కార్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సినిమాలు, వెబ్ సీరీస్ లు చేస్తూ ప్రదీప్ సర్కార్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రదీప్ సర్కార్ చివరగా 2022లో ‘దురంగా’ వెబ్ సీరీస్ చేసాడు. ప్రదీప్ సర్కార్ అంత్యక్రియలు ఈరోజు సాయంతం నాలుగు గంటలకి శాంటాక్రూజ్ హిందూ క్రిమిటోరియంలో జరగనున్నాయి.