Site icon Prime9

Balagam Movie Singer : బలగం మూవీ సింగర్ మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆదుకోవాలంటూ !

balagam-movie-singer mogilayya got serious health issue

balagam-movie-singer mogilayya got serious health issue

Balagam Movie Singer : ప్రముఖ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం బలగం. తెలంగాణ పల్లె జీవితాలను, మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా చిన్న చిత్రంగా రిలీజ్ అయినప్పటికీ.. పెద్ద రేంజ్ లో హిట్ సాధించింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించగా.. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు.

అయితే ఈ సినిమాతో గాయకుడు మొగిలయ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరంగల్‌ జిల్లా దుగ్గొండికి చెందిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బుర్ర కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వచ్చిన కళ బుర్రకథను చెప్పడమే జీవనాధారం చేసుకొని.. మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్‌, సిరిసిల్ల తదితర జిల్లాల్లో బుర్రకథ చెబుతూ ఉంటారు. ఆ విధంగా వచ్చిన కొంత మేర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి కుమారుడు సుదర్శన్‌ స్టీల్‌ సామాన్ల వ్యాపారం చేస్తున్నాడు. కొన్ని రోజుల కిందట ఈ దంపతుల బుర్రకథను విన్న బలగం సినీ దర్శకుడు వేణు క్లైమాక్స్‌లో పాటపాడేందుకు అవకాశం కల్పించాడు. సినిమా హిట్‌ అవడంతో మొగిలయ్య దంపతులకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

కాగా బలగం క్లైమాక్స్ లో ఆయన పాడిన పాట అందరితో కంటతడి పెట్టించింది. క్లైమాక్స్ అందర్నీ కట్టిపడేశాల ఏడిపించడంలో ఈ సాంగ్ ముఖ్య పాత్ర పోషించింది. కాగా మొగిలయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో వారానికి మూడుసార్లు డయాలసిస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండె సంబంధిత సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించాలని సూచించారు. తన భర్తకు వైద్య సాయం అందించి, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. కొద్ది రోజుల క్రితం మంత్రి హరీష్ రావు కూడా మొగిలయ్య అనారోగ్యం పట్ల స్పందించి వైద్యానికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దాతలు ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు సమాచారం అందుతుంది.

ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది బలగం సినిమా. కాగా ఇప్పటికే లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్, యుక్రెయిన్ ఒనికో అవార్డ్స్, వాషింగ్టన్ డీసీ సినిమా ఫెస్టివల్ అవార్డ్స్, అరౌండ్ ఇంటర్నేషనల్ అవార్డులలో పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. దీంతో సినిమాని మరిన్ని ఫిలిం ఫెస్టివల్స్, అవార్డులకు పంపిస్తున్నారు. తాజాగా ఓ ఫిలిం ఫెస్టివల్ లో బలగం సినిమా ఏకంగా 9 విభాగాల్లో అవార్డులు సాధించింది. ఇటీవల ప్రకటించిన ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బలగం సినిమా 9 విభాగాల్లో అవార్డులు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ మూవీ.

Exit mobile version