Site icon Prime9

Ap Cm Ys Jagan : మత్స్యకార భరోసా నిధులను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్.. నిజాంపట్నంలో పర్యటన

ap cm ys jagan release matsyakara scheme money

ap cm ys jagan release matsyakara scheme money

Ap Cm Ys Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ మత్స్యకార భరోసా లబ్దిదారులకు నగదు జమ చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయడం గమనార్హం.

రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఈ ఏడాది లబ్ధి పొందనున్నారు. వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్‌ 15– జూన్‌ 14 కాలంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వ ఆర్ధిక సహాయం చేస్తూ వస్తుంది. మొత్తం 123.52 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు జగన్.. దీంతో పాటు కోనసీమ, కాకినాడ జిల్లాల లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ. 108 కోట్లతో ఆర్ధిక సహాయం చేయనున్నారు. ఓఎన్‌జీసీ సంస్థ పైప్‌ లైన్‌ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23,458 మత్స్యకార కుటుంబాలకు కూడా సాయం చేయనున్నారు. మొత్తం రూ. 231 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమ చేశారు.

 

అంతే కాకుండా ఆయిల్‌ సబ్సిడీని రూ.9కి పెంచారు. మత్స్యకారులకు స్మార్ట్‌ కార్డులు ఇచ్చారు. వీటి ద్వారా సబ్సిడీ మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డీజిల్‌కు చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇలా ఏటా సగటున 20 వేల బోట్లకు రూ.25 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 26 ఆక్వా హబ్‌లు.. వాటికి అనుసంధానంగా 4,000 రిటైల్‌ షాపుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మత్స్య, ఆక్వా రైతులకు సేవలు అందించేందుకు వీలుగా వెబ్‌ అప్లికేషన్‌ ఈ–మత్స్యకార్‌తోపాటు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 155251ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు.

21 నుంచి 60 వయసు లోపు మత్స్యకారులగా జీవనోపాధి పొందుతున్నవారు మాత్రమే ఈ వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకానికి అర్హులు. అలాగే అర్బన్‌ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఇల్లు ఉండకూడదు. ఈ పథకం 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట, రెండు కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉన్నవాళ్లకు వర్తించదు. అర్బన్ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలలోపు.. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలి. ఐటీ చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కాదు. అంతేకాదు మత్స్యకార పింఛన్, సంక్షేమ పథకాలు పొందుతున్నవారు ఈ పథకానికి అనర్హులుగా పేర్కొన్నారు.

Exit mobile version