AP CM Chandrababu to Visit Polavaram Project Today: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించనున్నారు. ఒక్క క్షణం కూడా వృథా కాకుండా పోలవరం పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది రెండవ సారి సీఎం పోలవరాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహించి, ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్‌ను తేదీలతో సహా వివరించనున్నారు.
రెండవ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా చెప్పే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రభుత్వం ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు మీద సమీక్ష నిర్వహించి, పనుల పురోగతిపై ఆరా తీసేది. కానీ, గత ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును జగన్ సర్కారు పక్కనబెట్టేసింది. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ దీనిపై ఫోకస్ పెరిగింది. ఈ ఏడాది జూన్ 17న తొలిసారి సీఎం ఈ ప్రాజెక్టును సందర్శించగా, నేడు రెండవ సారి పోలవరంలో పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సమీక్ష, షెడ్యూల్ విడుదల
సీఎంఓ సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి ఉదయం 10.45కి తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోనున్నారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలిస్తారు. అనంతరం 11.05 నుంచి గంటపాటు ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్ వన్, గ్యాప్ టూ, డీ వాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడతారు. ముఖ్యంగా వచ్చే ఏడాది జనవరి 2 నుంచి చేపట్టనున్న కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంపై సీఎం ఇంజినీర్లతో చర్చించనున్నారు.