AP Cabinet Key Decision over Pithapuram Development: 5 నెలల వరకు ఓ సాధారణ నియోజకవర్గంగా ఉన్న ప్రాంతం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. గతంలో ఏ పని కావాలన్నా, ఏ సంక్షేమ పథకం అందాలన్నా ముఖ్యమంత్రికో.. రాష్ట్ర మంత్రులకో విన్నవించుకోవాల్సిన పరిస్థితి నుంచి మాటంటే చాలు.. క్షణాల్లో పనులు జరిగిపోతున్న రోజులకు మారాయి. గతమెంతో ఘనమైనా, ఎన్నో ప్రఖ్యాతలు ఉన్నా… ఇన్నాళ్లూ మరుగున పడిపోయిన పిఠాపురానికి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. అభివృద్ధి, సంక్షేమంతో రాష్ట్రానికే ఐకాన్ గా నిలుస్తోంది… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకర్గం.
ఐకాన్ గా తీర్చిదిద్దుతా..
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ రూపురేఖలు సమూలంగా మార్చివేస్తానని డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నారు. అభివృద్ధి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక వైభవం దిశగా నియోజకవర్గాన్ని ముందుండి నడిపిస్తున్నారు. సోమవారం గొల్లప్రోలు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. నియోజకవర్గ అభివృద్ధిపై స్పష్టమెన హామీ ఇచ్చారు. అనుకున్నదే తడవుగా 48 గంటల్లోనే ఇచ్చిన హామీ నెవరేర్పారు. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పిఠాపురం ఏరియా అర్బన్ డెవలప్మెంట్ సెంటర్(పాడా) ఏర్పాటుతో పాటు స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ క్లీనిక్ ని 100 పడకల అత్యాధునిక ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపారు. దీనికి గాను రూ.38.32 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఐకాన్ గా తీర్చిదిద్దుతానని ప్రకటించిన జనసేనాని.. ఈ విధంగా సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టడం పట్ల వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయోజనాలెన్నో..
నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ తోపాటు 3 మండలాలు, 52 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 4 లక్షల జనాభా ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రతిపాదించిన పిఠాపురం ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు కాకినాడ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) పరిధిలో ఉన్న పై ప్రాంతాలన్నీ ఇకపై పాడా పరిధిలోకి రానున్నయి. దీని వల్ల మొత్తం నియోజవకర్గం దీని పరిధిలోకి రావాడంతో పాటు సమగ్రంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ కు సంబంధించి ప్లాన్లు, లేఅవుట్లు ఆమోదానికి సంబంధించిన రిజిస్టేషన్ల ద్వారా ఆదాయం లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు వస్తాయి. పాడా చైర్మన్ ఎన్నికయ్యే వరకు కలెక్టర్ లేదా ఐఏఎస్ స్థాయి అధికారి బాధ్యతలు వహిస్తారు. వైస్ చైర్మన్ గా ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తారు.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యం...
పిఠాపురం నియోజకవర్గ కేంద్రంలోని సీహెచ్‌సీకి స్థానిక మున్స్ఫిపాలిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రోజూ వందలాది మంది రోగులు వస్తుంటారు. 30 పడకల ఆస్పత్రిలో కోవిడ్ సమయంలో దాతల సహకారంతో మరో 30 బెట్లు సమకూర్చారు. అయితే అవసరాలకు సరిపడా వైద్యులు, సిబ్బంది, బెడ్డు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 30 పడకల ఆస్పత్రిగా ఉన్న పిఠాపురం సీహెచ్‌సీని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో 100 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేయనున్నారు. దీనికి గాను రాష్ట్ర కేబినెట్ 38.32 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది, ఈ నేపథ్యంలో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి అత్యాధునిక వైద్య సదుపాయాలు లభించనున్నాయి. 100 పడకలతో ఆస్పత్రి నిర్మించడంతో పాటు అదనపు భవనాలు, స్కానింగ్ సదుపాయం, ఇతర మౌలిక వసతులు కల్పిస్తారు. అలాగే అదనంగా సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ఇతర నిపుణులు, స్టాఫ్ నర్ఫులు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది కలిపి 66 పోస్టులను మంజూరు చేశారు.
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు…
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట ఇచ్చిన 48 గంటల్లోనే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు 100 పడకలుగా ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేయడంపై కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే ఆస్పత్రిలో వైద్యుల కొరతపై ఆయన స్పందించారు. కొత్తగా ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్భులు, ఒక స్టాఫ్ అటెండెంట్ ను నియమించి, సీఎస్‌ఆర్ నిధులతో ఎక్స్ రే ప్లాంటును ఏర్పాటు చేశారు. తాజా నిర్ణయంతో ఇకపై రోజూ వందలాది మంది రోగులకు అత్యాధునిక వైద్యం అందించే వీలుంటుంది. అలాగే పాడా ఏర్పాటు కారణంగా అభివృద్ధితో పాటు ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరిగి, జీవన ప్రమాణాలు సైతం మెరుగు పడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ అభివృద్ధి పట్ల జనసేనాని చూపుతున్న చొరవను అభినందిస్తున్నారు.
చకచకా జరిగిపోతున్నాయ్: మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన ఇన్‌ఛార్జ్, పిఠాపురం
సాధారణంగా ఒక్కో ప్రాంతానిదీ ఒక్కో సమస్య ఉంటుంది. నిధులు ఉన్న చోట, వ్యవస్థలు బాగోవు. వ్యవస్థలు బాగున్న ప్రాంతానికి సరైన నిధులు రావు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ గెలిచిన వెంటనే పిఠాపురం నియోజకవర్గంలో ఈ రెండిటినీ సమన్వయంతో చేయడంతో పాటు అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. గత 5 ఏళ్లు ఎటువంటి ప్రజా సమస్య ఉన్నా, ఏం చెప్పినా వినే నాథుడే లేకపోయేవాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ గారు రావడం కారణంగా.. ఆయన ఏం చెప్పినా చకచకా పనులు జరిగిపోతున్నాయ్. నియోజకవర్గ అభివృద్ధిలో అన్నింటా తానే వ్యవహరించడం శుభసూచకం.
మరింత అభివృద్ధి: పెద్దిరెడ్డి శివదుర్గ, 10వ వార్డు, పిఠాపురం మున్సిపాలిటీ
పాడాగా అప్ గ్రేడ్ చేయడం కారణంగా మా ప్రాంతం సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. విద్య, వైద్యం, రోడ్లు విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదనపు నిధులు వస్తాయి. రియల్ ఎస్టేట్ అవకాశాలు పెరగడంతో పాటు 100 పడకల ఆస్పత్రిలో ఆరోగ్యానికి భరోసా ఏర్పడుతుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. పిఠాపురం నియోజకవర్గం దేశానికే ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపట్టడం ఆనందంగా ఉంది.