Site icon Prime9

Amarnath: అమర్‌నాథ్‌ యాత్రికులపై ప్రకృతి కన్నెర్ర.. పోటెత్తిన వరద.. 15 మంది దుర్మరణం.. 40 మంది గల్లంతు

Jammu Kashmir: అమర్‌నాథ్‌ యాత్రికులపై ప్రకృతి కన్నెర్ర చేసింది. చుట్టూ ఉన్న కొండల్లోంచి ఆకస్మికంగా పోటెత్తిన వరద అమరనాథుడి గుహ ఎదుటే వాగులో సేదదీరుతున్న భక్తులపై అమాంతం వచ్చిపడింది. మట్టి, బురదతో కలగలిసి సజీవ సమాధి చేసింది. కొందరు వరదలో కొట్టుకుపోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. పుణ్య క్షేత్రాన్ని దర్శనం చేసుకొని, అక్కడి ఆధ్యాత్మిక జ్ఞాపకాలను మూటగట్టుకొని తమ వాళ్లు సంతోషంగా ఇళ్లకు తిరిగొస్తారని ఆశలు పెట్టుకున్న వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. శుక్రవారం సాయంత్రం 5:30 సమయంలో ఉన్నట్టుండి కురిసిన అతి భారీ వర్షం ధాటికి దక్షిణ జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ క్షేత్ర గుహ దగ్గర్లోని బేస్‌ క్యాంప్‌ ప్రాంతం అతలాకుతలమైంది.

ఎగువ నుంచి పోటెత్తిన వరద ఉధృతికి భక్తుల కోసం ఏర్పాటు చేసిన 25 టెంట్లు, మూడు సామూహిక వంటగదులు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 15 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పోటెత్తిన వరదలో 40 మంది కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఫలితంగా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్లలో ఎక్కించుకొని బేస్‌ క్యాంప్‌ ఆస్పత్రులకు తరలించారు. అతి భారీ వర్షం ధాటికి యాత్రా మార్గం ధ్వంసమవడంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు,  జాతీయ విపత్తు నిర్వహణ దళం  సభ్యులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

ఈ ఘటన పట్ల రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత భక్తులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని భరోసా ఇచ్చారు. ఘటన వివరాలపై మోదీకి జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఫోన్లో వివరించారు. కాగా ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత వేగవంతంగా సహాయక చర్యలను చేపట్టాలని కేంద్రబలగాలు, జమ్మూ కశ్మీర్‌ యంత్రాంగానికి హోంమంత్రి అమిత్‌ షా అదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై తాను జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో మాట్లాడినట్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌ బలగాలు సహాయక చర్యలకు దిగినట్లు ట్విటర్‌లో అమిత్‌ షా వెల్లడించారు.

ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి అమర్‌నాథ్‌ గుహ వైపు వరద పోటెత్తిందని ఇండో-టిబెటన్‌ సరిహద్దు దళానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. వర్షం ఇంకా కురుస్తూనే ఉన్నా పరిస్థితి అదుపులో ఉందని, యాత్రను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. భారీ వర్షం, వరద పోటు మొదలైన 10-15 నిమిషాల్లోనే అధికారులు సహాయక చర్యలకు దిగినట్లు, ఫలితంగా కొందరు భక్తులకు ప్రమాదం తప్పినట్లు చెబుతున్నారు. తమవారి ఆచూకీ తెలుసుకునేందుకు హెల్ఫ్‌లైన్‌ నంబర్లు హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వెల్లడంతో ఇప్పుడు ఆ కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికులకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో సీఎంవో అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాష్‌తో మాట్లాడారు. అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాంశు కౌశిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపిస్తున్నారు. ఆయన అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటారు.

కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న మొదలైంది. వాతావరణం బాగోలేదని మూడు రోజుల క్రితం యాత్రను నిలిపేశారు. వాతావరణం మెరుగుపడటంతో ఒక రోజులోనే తిరిగి పునః ప్రారంభించారు.

Exit mobile version
Skip to toolbar