Site icon Prime9

Zambia Cholera Outbreak: కలరాతో వణుకుతున్న జాంబియా .. 10,000కు పైగా కేసులు.. 400 మందికి పైగా మృతి

Zambia

Zambia

 Zambia Cholera Outbreak: ఆఫ్రికా దేశం జాంబియాలో కలరాతో వణికిపోతోంది. దేశ వ్యాప్తంగా 10,000 మందికి పైగా కలరా బారిన పడగా 400 మందికి పైగా మరణించారు. దీనితో ప్రభుత్వం దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేసింది. రాజధాని లుసాకాలోని ఫుట్‌బాల్ స్టేడియంను చికిత్సా కేంద్రంగా మార్చింది.

కలరా అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన డయేరియా ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది.జాంబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని దాదాపు సగం జిల్లాలలో మరియు 10 ప్రావిన్సులలోని తొమ్మిదింటిలో కలరా ఉందని తెలిపింది. రోజుకు 400 కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. ఈ వ్యాప్తి దేశం యొక్క ఆరోగ్య భద్రతకు ముప్పుగా కొనసాగుతోందని ఆరోగ్య మంత్రి సిల్వియా మాసెబో అన్నారు. ఇది దేశవ్యాప్త సమస్య అని వివరించారు. యునిసెఫ్ మూడు నెలల వ్యాప్తిలో మరణాల రేటు సుమారు 4% గా ఉందని పేర్కొంది.2023 ప్రారంభం నుండి దక్షిణాఫ్రికాలో 200,000 కంటే ఎక్కువ కేసులు మరియు 3,000 మరణాలు నమోదయ్యాయనితెలిపింది.

20 ఏళ్లలో ఇదే ప్రధమం..( Zambia Cholera Outbreak)

మలావి, మొజాంబిక్ మరియు జింబాబ్వేతో సహా ఇతర దక్షిణ ఆఫ్రికా దేశాలలో ఇటీవల కలరా వ్యాప్తి చెందింది.మలావిలో కలరా వ్యాప్తి అత్యంత దారుణంగా ఉంది. గత సంవత్సరం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికాలోని నైజీరియా మరియు ఉగాండాతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాలు గత కొన్ని సంవత్సరాలలో తీవ్రమైన కలరా వ్యాప్తికి గురయ్యాయని నివేదించింది. జాంబియాలో సగానికి పైగా బాధితులు చికిత్సకు ముందే మరణించారని పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్ తెలిపింది.జాంబియాలో 1970ల నుండి అనేక ప్రధాన కలరా వ్యాప్తి ఉంది. 20 సంవత్సరాలలో అత్యంత దారుణంగా వ్యాప్తి చెందడం మాత్రం ఇప్పుడే ప్రధమం అని చెబుతున్నారు. జాంబియా యొక్క విపత్తు నిర్వహణ మరియు ఉపశమన విభాగం శుభ్రంగా ఉన్న పెద్ద నీటి ట్యాంకులను పంపిణీ చేస్తోంది. ప్రతిరోజూ కొన్ని ప్రాంతాల్లో నీటిని శుద్ధి చేసేందుకు క్లోరిన్‌ను కూడా అందిస్తున్నట్లు తెలిపింది. జనవరి 8న తెరవబడే పాఠశాలలు జనవరి 29న మాత్రమే తెరచుకుంటాయని జాంబియా ప్రభుత్వంప్రకటించింది.

Exit mobile version