Yemen: యెమన్‌లో బోటు మునిగిపోవడంతో సుమారు 49 మంది మృతి చెందగా 140 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. మృతి చెందిన వారిలో అత్యధికంగా మహిళలు, చిన్న పిల్లలే ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఆఫ్రికా నుంచి బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు వలస వెళుతున్నప్పుడు ఈ విషాదం చోటు చేసుకుందని ఐక్యరాజ్యసమితి మంగళవారం నాడు తెలిపింది. 260 మంది ప్రయాణికులతో బయలు దేరిన ఈ బోటు దక్షిణ షాబ్‌వా ప్రాంతంలో మునిగిపోయిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ మంగళవారం తెలిపింది.
గాలింపు చర్యలకు బోట్ల కొరత..(Yemen)
కాగా ఈ బోటులో 115 మంది సోమాలియా పౌరులు, 145 ఇథియోపియన్‌లు ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో 31 మంది మహిళలు ఆరుగురు పిల్లలున్నారని, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే గాలింపు చర్యలకు బోటుల కొరత వేధిస్తోందిన ఐఓమ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రతి ఏడాది వేలాది మంది వలసవాదులు కరువుతో కటకటలాడుతున్న ఆఫ్రికా దేశాల నుంచి ఎర్ర సముద్రం ద్వారా గల్ప్ దేశాలకు వలస వస్తుంటారు. ఇక ఆఫ్రికా దేశాల విషయానికి వస్తే ఎప్పుడూ అంతర్యుద్దాలతో పాటు ప్రకృతి విపత్తులు సంభవిస్తుంటాయి. దీంతో పాటు ఆర్థికంగా వెనుకబాటు తనం వల్ల మెరుగైన జీవితాల కోసం ఇతర దేశాలకు వలస వెళ్తుంటారు. 2023లో ఐఓఎం సమాచారం ప్రకారం సుమారు 97,200 మంది యేమన్‌కు వలస వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు బోటులో జిబౌటీ తీర ప్రాంతంలో మునిగిపోవడంతో 62 మంది చనిపోయారని యూఎన్ ఏజెన్సీ రికార్డు చెబుతున్నాయి. కాగా మంగళవారం నాడు ఐఓఎం విడుదల చేసిన ప్రకటనల ప్రకారం 2014 నుంచి వలస వెళ్లిన వారిలో సుమారు1,860 మంది చనిపోయారని చెబుతున్నారు. వారిలో 480 మంద బోటు మునిగిపోవడంతో చనిపోయారని యూఎన్ ఏజెన్సీ అంచనా వేసింది.