Indian Students in krygistan: గత వారం కిర్గిస్థాన్‌లోని బిష్కెక్ లో భారతీయ విద్యార్థులను అక్కడి స్థానికులు చితకబాదిన విషయం తెలిసిందే. అక్కడ మెడిసిన్ చదువుతున్న తెలుగు విద్యార్థులు ప్రైమ్ 9తో మాట్లాడి తమ గోడును వెలిబుచ్చుకున్నారు. తమను వెంటనే ఇక్కడి నుంచి ఇండియాకు తరలించాలని మొరపెట్టుకున్నారు. అయితే అక్కడి తాజా పరిస్థితి ఏమిటంటే మెజారిటి విద్యార్ధులు తమను బిష్కెక్ నుంచి బయటపడేలా చూడాలని మొరపెట్టుకుంటున్నారు. కిర్గిస్థాన్‌లో తమ ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇక్కడి ప్రైవేట్ అపార్టుమెంట్లలో ఉన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాము ఎక్కడికి వెళితే అక్కడదాడులు జరుగుతున్నాయి. ఒక వేళ కిరాణా షాపుకు వెళ్లి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేద్దామన్నా వారి నుంచి దాడులు తప్పడం లేదని భయంతో వణికిపోతున్నారు.
అకడమిక్ ఇయర్ చివరిదశలో.. (Indian Students in krygistan)
ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కేవలం ఐదు వారాలు గడిస్తే అకాడమిక్ ఇయర్ అయిపోతుంది. అందుకే చాలా మంది విద్యార్థులు యూనివర్శిటీ అధికారులతో యూనివర్శిటీని మూసివేయరాదని.. ఆన్‌లైన్ క్లాసెస్ కొనసాగించాలని కోరుతున్నారు. అలాగే భారత అధికారులు తమను ఇక్కడి నుంచి క్షేమంగా తరలించాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడ్డాయి. క్షేమంగా ఉన్నామని.. దీనికి యూనివర్శిటీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. తమపై దాడులు చేసిన వెంటనే యూనివర్శిటీ అధికారులకు పంపిన ఎస్‌ఓఎస్ కాల్స్‌కు అధికారులు స్పందించి రాత్రంతా తమ వెంటే రక్షణగా ఉన్నారని చెప్పారు. జీవితాంతం వారికి రుణపడి ఉంటామన్నారు విద్యార్థులు. ఐదు వారాలు గడిస్తే విద్యా సంవతత్సరం ముగుస్తుందని విద్యార్థులు చెప్పారు.
ఆన్‌లైన్ క్లాస్‌లు పొడిగిస్తాం..
ప్రస్తుతం యూనివర్శిటీ అధికారులు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. కావాలనుకుంటే మరో నాలుగు వారాల పాటు ఆన్‌లైన్ క్లాస్‌లు పొడిగిస్తామన్నారు. కాగా శ్రీకాకుళానికి చెందిన గండి సోమేశ్వరరావు మాత్రం భారత అధికారులు తమను క్షేమంగా ఎయిర్‌పోర్ట్‌కు తరలించి విమానం ఎక్కించే వరకు దగ్గరుంటే చాలని కోరుతున్నారు. ఈ నెల 13న ఈజిప్షియన్స్ విద్యార్థులకు స్థానికులకు మధ్య గొడవలు జరిగాయి. అది కాస్తా తీవ్రరూపం దాల్చి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులను టార్గెట్ చేశారు. సోమవారం కూడా విద్యార్థుల హాస్టల్ తలుపులు తట్టినా… తలుపులు తెరవకపోవడంతో గది ముందు చెత్త వేసి వెళ్లారని హైదరాబాద్‌కు చెందిన విద్యార్ధి ఒకరు చెప్పారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుకుంటున్నా గతంలో ఇలాంటి సంఘటనలు తమకు ఎదురు కాలేదని చెబుతున్నారు విద్యార్థులు.
ఇక విద్యార్థులు పెద్ద ఎత్తున కిర్గిస్థాన్ వెళ్లి చదువుకోవడానికి ప్రధాన కారణం ఆరు సంవత్సరాల మెడిసిన్ కోర్సుతో పాటు హోస్టల్ ఖర్చులు కలుపుకొని కేవలం రూ.30 లక్షల మాత్రమే అవుతోందని సోమేశ్వరరావు అనే విద్యార్థి చెప్పాడు. సుమారు 9వేల మంది విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులు మాత్రం తెలుగు రాష్ర్టాలకు చెందిన వారు కావడం గమనార్హం. కాగా శ్రీకాకుళం ఎంపీ కె రామమోహన్ నాయుడు విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్ దృష్టికి తాజా పరిస్థితిని తీసుకు వెళ్లారు. ఆయన కిర్గిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులను విద్యార్థుల భద్రతపై గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.