Joe Biden contest: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడతానంటూ అధికారికంగా ప్రకటించారు. పోటీకి తన వయసు ఎలాంటి అడ్డంకి కాదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష పదవి పోటీ చేస్తానని, రిపబ్లికన్ అభ్యర్థిని ఎదుర్కొంటానని పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం తాను అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడినప్పుడు కూడా తాను అమెరికా ఆత్మ కోసం పోరాడుతున్నానని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని వీడియోల పేర్కొన్నారు. ఈ వీడియోలో జనవరి 2, 2021 ఇమేజ్‌లను పొందుపర్చారు. ఇప్పటి వరకు వచ్చే ఎన్నికల్లో బైడెన్ పోటీ చేస్తారా లేదా అనే సస్పెన్స్ నేటితో తెరపడింది. అయితే ఈ సారి కూడా ఆయన మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ట్రంప్ విషయానికి వస్తే ఇప్పటికే ఆయనపై పలు కేసులు నడుస్తున్నాయి. అయినా తాను పోటీపడతానని ప్రకటించారు. అయితే ఆయన అప్రూవల్ రేటింగ్ మాత్రం తక్కువగా ఉంది. అయితే బైడెన్ పార్టీకి చెందిన డెమోక్రాటిక్‌ల నుంచి ఆయన పోటీగా నిలిచే వారు ఎవ్వరూ లేకపోవడంతో బైడెన్‌కు అవకాశం చిక్కింది. ఆయనకు పార్టీలో ఇద్దరు మాత్రమే పోటీగా ఉన్నారు. రచయిత మారియన్నా విలియమ్‌సన్ ఒకరు కాగా మరో వ్యక్తి యాంటీ వ్యాక్సినేషన్ కార్యకర్తతో పాటు పర్యావరణ న్యాయవాది రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్.
వచ్చే ఎన్నికలు బైడెన్‌కు నల్లేరు మీద నడక మాత్రం కాదు. ఆయన పలు సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఒకటి ఉక్రెయిన్ యుద్ధం, మరోటి దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలహీనపడుతోంది. ఇవన్నీ బైడెన్‌కు పెద్ద సవాలు కాబోతున్నాయి. ముఖ్యంగా ఆయన వయసు అడ్డంకి కాబోతోంది. 86ఏళ్ల వయసులో దేశధ్యక్షుడిగా అమెరికన్ ప్రజలు ఎన్నుకోవడం అనుమానమే అంటున్నారు అక్కడి రాజకీయ నాయకులు.
వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తాను కూడా తిరిగి ఎన్నికకు పోటీ చేస్తున్నానని ప్రకటించారు.కోవిడ్ మహమ్మారి మరియు ద్వైపాక్షిక సురక్షిత కమ్యూనిటీల చట్టం తో ఇప్పటికీ పోరాడుతున్న గృహాలకు ఆర్థిక సహాయం అందించే అమెరికన్ రెస్క్యూ ప్లాన్‌పై ఆయన సంతకం చేయడం, దాదాపు మూడు దశాబ్దాలలో చట్టంగా సంతకం చేయబడిన ప్రధాన ఫెడరల్ గన్ సేఫ్టీ బిల్లు, అతను మళ్లీ ఎన్నికవడానికి తోడ్పడవచ్చని భావిస్తున్నారు.