US Military Aircraft: అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం జపాన్ సముద్రంలో కుప్పకూలింది. యకుషిమా దీవి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో ఆరుగురు సైనిక సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో స్పృహతప్పి కనిపించిన ఒక వ్యక్తిని జపాన్ కోస్ట్‌గార్డు సిబ్బంది హుటాహుటిన యకుషిమాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. ఎయిర్‌క్రాఫ్ట్‌లోని మిగతా ఐదుగురికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.
ఎక్కువ ప్రమాదాలు..(US Military Aircraft)
కాగా, ప్రమాదం సంగతిని జపాన్ కోస్ట్ గార్డ్ ధ్రువీకరించింది. జపాన్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.47 గంటల సమయంలో సముద్రంలో ఓ విమానం కుప్పకూలినట్లు యకుషిమాకు చెందిన మత్స్యకారులు గుర్తించారు. వెంటనే వారు స్థానిక కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన కోస్ట్ గార్డ్ రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. కాగా, విమానం ఎడమ ఇంజిన్ మండిపోతూ సముద్రంలో పడిపోయిందని స్థానికులు మీడియాకు తెలిపారు. ఈ ప్రమాదంపై అమెరికా సాయుధ బలగాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.ప్రమాదానికి గురైన ఓస్ప్రే ఎయిర్‌క్రాఫ్ట్ అమెరికా సైన్యానికి చెందిన ప్రత్యేకమైన విమానం. ఇది హెలికాప్టర్‌గా, విమానంగా పనిచేస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో కూడా అమెరికా మెరైన్ విభాగానికి చెందిన రెండు ఓస్ప్రే విమానాలు డార్విన్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని తివి ద్వీపానికి బయల్దేరాయి. వీటిల్లో ఒకటి కూలిపోయింది. ఇప్పటికే ఈ రకం విమానాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. 2022లో కూడా ఈ రకం విమానం కూలి ఐదుగురు సైనిక సిబ్బంది చనిపోయారు. అదే ఏడాది నాటో శిక్షణ సమయంలో నార్వేలో మరొకటి కూలిపోయి నలుగురు చనిపోయారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 12 విమానాలు కూలిపోయాయి.