US Couple Lottery Win: యునైటెడ్ స్టేట్స్ లో పదవీ విరమణ పొందిన ఒక జంట విన్ ఫాల్ లాటరీలో సుమారుగా రూ.200 కోట్లు సంపాదించారు. గణిత శాస్త్రంలో ప్రావీణ్యాన్ని ఉపయోగించి దాని ప్రకారం లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసి వారు ఈ భారీ మొత్తాన్ని పొందగలిగారు.
జెర్రీ ( 80) మరియు మార్జ్ సెల్బీ (81) దంపతులు చాలాకాలం ఒక స్టోర్ ను నడిపారు. తరువాత దానిని విక్రయించి విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. కళాశాలలో చదువుకునే సమయంలో గణితంలో మంచి పట్టు సంపాదించిన సెల్బీ 1,100 టిక్కెట్ల పై $1,100 ఖర్చు చేస్తే,$1,900 పొందవచ్చని గ్రహించాడు. ఈ జంట ప్రారంభంలో $3,600 విన్‌ఫాల్ టిక్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోగాలు చేసి, దాదాపు $6,300 సంపాదించారు. ఆ తర్వాత, $8,000 తో టిక్కెట్లను కొన్నారు. ఈ సారి లాభం రెట్టింపయింది. దీనితో వారు వారు G.S ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. వారి స్నేహితులనుమరియు కుటుంబ సభ్యులను సభ్యులుగా చేర్చుకున్నారు. తర్వాత వారు దాదాపు 700 మైళ్ల దూరంలో ఉన్న మసాచుసెట్స్‌లో ఇలాంటి విన్‌ఫాల్ లాటరీ వుందని తెలుసుకున్నారు. మసాచుసెట్స్‌కు వెళ్లి రెండు దుకాణాలలో వేలాది టిక్కెట్లను కొనుగోలు చేశారు.తొమ్మిదేళ్లలో తమ బృందం మొత్తం $26 మిలియన్లను గెలుచుకున్నట్లు సెల్బీ దంపతులు చెప్పారు. ఈ డబ్బు వారి ఇంటిని తిరిగి నిర్మించుకోవడానికి, మనవలు,మనవరాళ్ల చదువుకు ఉపయోగించామన్నారు.
అయితే లాటరీలో వారి లాభాలు, పెద్ద ఎత్తున టిక్కెట్ల కొనుగోళ్లపై ఇన్‌స్పెక్టర్ జనరల్ విచారణ కూడా జరిగింది. అయితే వీరు నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తున్నారని, చట్టవిరుద్ధం ఏమీ లేదని తేలింది. మరో విశేషమేమిటంటే ఇపుడు వీరి కథ జెర్రీ & మార్జ్ గో లార్జ్ అనే చిత్రానికి ప్రేరణగా మారింది.