Site icon Prime9

Turkey summit: టర్కీ సదస్సులో రష్యా ప్రతినిధినిని కొట్టిన ఉక్రెయిన్ ఎంపీ.. ఎందుకో తెలుసా?

Turkey summit

Turkey summit

Turkey summit: టర్కీ రాజధాని అంకారా లో జరుగుతున్న గ్లోబల్‌ సమ్మిట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌ ఎంపీ , రష్యా ప్రతినిధి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంకారా లో జరుగుతున్న బ్లాక్‌ సీ ఎకనామిక్‌ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ అసెంబ్లీ సమావేశాల్లో ఉక్రెయిన్‌ ఎంపీ ఒలెక్సాండర్‌ మారికోవిస్కీ పాల్గొన్నారు. ఇదే సమ్మిట్‌కు పలువురు రష్యా ప్రతినిధులు, ఇతర దేశాధినేతలు హాజరయ్యారు.

ఉక్రెయిన్ జెండాను లాక్కున్న రష్యా ప్రతినిధి..(Turkey summit)

ఈ క్రమంలో సమ్మిట్‌లో ఉక్రెయిన్‌ ఎంపీ ఒలెక్సాండర్‌ తమ దేశ జెండాను ప్రదర్శించాడు. ఇది గమనించిన రష్యా ప్రతినిధి ఒకరు ఒలెక్సాండర్‌ చేతిలోని జెండాను ఒక్కసారిగా లాక్కొని అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఉక్రెయిన్‌ ఎంపీ అతన్ని వెంబడించి పట్టుకున్నాడు. రష్యా ప్రతినిధిని కొ ట్టాడు. అక్కడే ఉన్న ఇతర అధికారులు వీరిని అడ్డుకున్నారు. అనంతరం రష్యా ప్రతినిధి చేతిలోని జెండాని ఎంపీ లాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఇక రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ముగింపు ఛాయలు కనిపించకపోగా రోజురోజుకూ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లు దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా తీవ్రంగా మండిపడుతోంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని చంపడం మినహా మరో మార్గం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌ ఈ దాడికి తాము కారణం కాదని వెల్లడించింది. ఈ క్రమంలో ప్రస్తుత వీడియో వెలుగులోకి వచ్చింది. బ్లాక్‌ సీ ఎకనామిక్‌ కమ్యూనిటీ 30 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. దీనిలో ఉక్రెయిన్‌, రష్యా సభ్యదేశాలు.

Exit mobile version