Nobel Prize: 2023 సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ నోబెల్ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, ఎల్’హ్యులియర్‌లకు అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్’పై చేసిన విస్తృత పరిశోధనలకుగాను వీరిని నోబెల్ బహుమతి వరించింది.
విభిన్న రంగాల్లోని ప్రతిభావంతులకు నోబెల్ అవార్డులను ప్రకటించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా మొదట వైద్య రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించింది కమిటీ. మంగళవారం భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తలు పేర్లను ప్రకటించారు. కాగా ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించడం విశేషం. వీరు అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లను అధ్యయనం చేసేందుకు అట్టోసెకెండ్ పల్సెస్ డెవలప్‌మెంట్‌పై చేసిన ప్రయోగాలకుగాను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. వీరిలో ఎల్’హ్యులియర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఐదవ మహిళగా ఘనత సాధించారు. 1903లో మేరీ క్యురీ, 1963లో మరియా గొప్పెర్ట్-మేయర్, 2018లో డొన్నా స్ట్రిక్‌లాండ్, 2020లో ఘెజ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలను సాధించగా 2023 సంవత్సరానికి గాను హ్యులియర్ ఈ పురస్కారాన్ని సాధించి చరిత్రలో చోటు సంపాదించారు.
నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించే క్రమంలో ఇప్పటికే వైద్య, భౌతిక రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించిన కమిటీ బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి రంగాల్లో బహుమతుల విజేతలను ప్రకటించనుంది. చివరిగా ఈ నెల 9న అర్థశాస్త్రంలో విజేతను ప్రకటించనుంది జ్యురీ. నోబెల్ విజేతలకు డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు.