COP-27 Summit: వాతావరణ కాలుష్యం తగ్గించడానికి యూఎన్ క్లయిమేట్ సమ్మిట్ ఈజిప్టులో జరుగుతోంది. ఈ సమ్మిట్ ఈజిప్టులోని బీచ్ రిసార్ట్ ప్రాంతమైన షార్మ్ ఎల్ షేక్‌లో జరుగుతోంది. ఈ సదస్సులో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో శాస్ర్తవేత్తలు సూచిస్తారు. సంపన్న దేశాల నిర్వాకంతో పేద దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వాతావరణ సమతూల్యం దెబ్బతింటోంది. విపరీతమైన పారిశ్రామికీకరణతో వాతావరణంలో మార్పుల కారణంగా ప్రస్తుతం ప్రపంచంలోని సగం భాగం అత్యంత ఉష్ణోగ్రతతో బాధపడుతుంటే.. కొన్ని దేశాలు వరదలు, తుఫానులతో అతలాకుతలం అవుతున్నాయి.
అయితే షోషల్ మీడియాలో క్లయిమేట్ సమ్మిట్ లేదా కాప్ -27 సదస్సుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే వాతావరణం కాలుష్యం తగ్గించాలని నీతులు చెప్పే నాయకులు తమ తమ ప్రైవేట్ జెట్‌లలో రావడం చర్చనీయాంశం అయ్యింది. షార్మ్ ఎల్ షేక్ రిసార్టుకు సుమారు 400 ప్రైవేట్ జెట్‌లు వచ్చాయని ఈజిప్షియన్ మీడియా కోడై కూస్తోంది. కాగా స్పానిష్ మీడియా మాత్రం తప్పుదోవ పట్టించే పోస్ట్ ఒకటి పెట్టింది. సుమారు 1,500 ప్రైవేట్ జెట్‌లలో ఆయా దేశాల నాయకులు, సీఈవోలు ఈజిప్టుకు వచ్చారని వెల్లడించింది. అయితే ఇది తప్పుడు వార్త అని చెబుతున్నారు.
అయితే ఈజిప్షియన్ ఏవియేషన్ అధికారులు మాత్రం గత కొన్ని రోజుల నుంచి ఈజిప్టులో సుమారు 400 కంటే ఎక్కువ ప్రైవేట్ విమానాలు ల్యాండ్ అయ్యయాని తెలిపారు. ఈజిప్షియన్ అధికారులు మాత్రం ముందుగానే ఊహించుకుని.. వచ్చే అతిథులు ప్రైవేట్ జెట్‌లలో వస్తారని భావించి దానికి తగ్గట్టు షార్మా ఎల్ షెక్ విమానాశ్రయంలో ఏర్పాట్లు చేశారు. ఈ నెల 6న అహ్మద్ మూసా ఓ టాక్ షోలో కాప్ -27 సదస్సకు వచ్చే అతిథులకు స్వాగతం పలకడానికి ఎయిర్‌పోర్టును పెద్ద ఎత్తున మరమ్మతులు చేసినట్లు చెప్పారు. సుమారు 300 ప్రైవేట్ జెట్‌లు పార్క్ చేసుకొనే విధంగా ఏర్పాట్లు చేశారని అహ్మద్ మూసా టాక్ షో లో చెప్పారు.