Taiwan Earthquakes: తైవాన్ తూర్పు తీరంలో 24 గంటల వ్యవధిలో 6.3 తీవ్రతతో 80 భూకంపాలు సంభవించాయి. సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు సంభవించిన ఈ భూకంపాల ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది.
దేశం తూర్పు ప్రాంతంలోని హువాలియన్‌లో ఎక్కువ భూకంపాల కేంద్రాలను గుర్తించినట్టు వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.రాజధాని తైపీతో సహా ఉత్తర, తూర్పు మరియు పశ్చిమ తైవాన్‌లోని పలు ప్రాంతాల్లో భవనాలు రాత్రంతా కంపించాయి. తైవాన్ ప్రపంచంలో అతిపెద్ద చిప్ మేకర్ గా ఉంది. వీటికి సంబంధించిన కర్మాగారాలు ద్వీపం యొక్క పశ్చిమతీరంలో ఉన్నాయి. భూకంపాల కారణంగా పలు కర్మాగారాల్లో సిబ్బందిని ఖాళీచేయించారు. అయితే భద్రతా వ్యవస్దలు, సౌకర్యాలు సాధారణంగా పనిచేస్తున్నందున సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.పర్వత ప్రాంతమైన హువాలియన్ కౌంటీలో కొండచరియలు విరిగిపడటంతో కొన్ని రహదారులు మూసివేసారు. ఆయా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 1999లో తైవాన్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2,400 మంది మరణించారు.