Site icon Prime9

Mumbai Attacks : ప్లీజ్.. అప్పగించొద్దు : భారత్‌పై తహవూర్ రాణా నిందలు

Mumbai Attacks

Mumbai Attacks : తనను ఇండియాకు అప్పగించొద్దని ముంబై ఉగ్రదాడి ఘటనలో దోషిగా ఉన్న తహవూర్‌ రాణా అగ్రరాజ్యం అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. తన అప్పగింతను నిలిపివేయాలని అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఇండియాకు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని ఆరోపించాడు. ఈ మేరకు జాతీయ మీడియా కథనం వెల్లడించింది. అప్పగింతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమ్మతి తెలిపిన నేపథ్యంలో పిటిషన్ వేసి భారత్‌పై నిందలు మోపాడు.

ముంబై దాడుల్లో కీలక సూత్రధారి..
రాణా పాకిస్థాన్‌ దేశానికి చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబై దాడుల్లో అతడు కీలక సూత్రధారి. ఇప్పుడు లాస్‌ ఏంజెలెస్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తహవూర్‌ రాణాను తమకు అప్పగించాని కొంతకాలంగా ఇండియా పోరాడుతోంది. దీన్ని సవాల్‌ చేస్తూ అతడు పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే ఆయా కోర్టులు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్‌లో కూడా అతడికి చుక్కెదురైంది. దాంతో రాణా గతేడాది నవంబరు 13న అమెరికా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాడు. పిటిషన్‌ను కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ. 20 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దానిని పరిశీలించిన సుప్రీంకోర్టు తహవూర్‌ రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతడిని ఇండియాకు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఇటీవల రాణా అప్పగింతపై డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

మరికొన్ని నెలల్లో భారత్‌కు అప్పగించే అవకాశాలు..
ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్‌ మాట్లాడారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడు ప్రమాదకరమైన వ్యక్తిని ఇండియాకు అప్పగిస్తున్నామని తెలిపారు. త్వరలోనే మరి కొంతమందిని నేరగాళ్ల విషయంలో అదే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దీంతో మరికొన్ని నెలల్లో రాణాను ఇండియాకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా వుంటే.. ముంబై దాడులకు ముందు కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు. అతడికి తహవూర్‌ రాణా సహకరించినట్లు చెబుతున్నారు. 15 ఏళ్ల కింద ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయం అయ్యాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్‌ తయారీలో తహవూర్‌ హస్తం ఉంది. రాణా, హెడ్లీపై ఉగ్రదాడులు, కుట్ర కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్‌బీఐ అధికారులు తహవూర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version
Skip to toolbar