Site icon Prime9

Sri Lanka: టూరిస్టు స్పాట్ గా మారిన శ్రీలంక అధ్యక్షుడి నివాసం.. స్విమ్మింగ్ పూల్ లో ఈతకొట్టి.. కిచెన్ లోకి వెళ్లి తిన్న నిరసనకారులు

Sri Lanka: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశ అధ్య‌క్షుడు గొట‌బాయ‌ రాజ‌ప‌క్స రాజీనామా చేయాల‌ని దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు మిన్నంటాయి. నిర‌స‌న‌కారులు కొలంబోలోని రాజ‌ప‌క్స ఇంటిని చుట్టుముట్టారు. దీంతో గొట‌బాయ వారినుంచి త‌ప్పించుకుని ప‌రార‌య్యారు. ఆందోళ‌న‌కారుల‌పై లంక సైన్యం టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించింది. కొంద‌రు నిర‌స‌న‌కారులు లంక అధ్య‌క్షుడి ఇంట్లోకి చొచ్చుకెళ్లారు. ఆయ‌న నివాసంలోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత‌కొట్టారు. జిమ్ లో పరికరాలను ఉపయోగించారు. కిచెన్ లోకి వెళ్లి ఆహారపదార్దాలను రుచి చూసారు. జాతీయ జెండాల‌ను రెప‌రెప‌లాడించారు.నిరసనకారులు భవనం నుండి పెద్ద మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. స్థానిక మీడియా ప్రకారం, రికవరీ చేసిన డబ్బును భద్రతా విభాగాలకు అప్పగించినట్లు సమాచారం.

శ్రీలంక రాజధాని కొలంబోలో ప్రజాగ్రహం మిన్నంటింది. మొదట దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసాన్ని ముట్టడించిన ఆందోళనకారులు, ఆ తర్వాత ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రైవేటు నివాసానికి నిప్పంటించారు. గేట్లు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించిన నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రధానికి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా ఫలితంలేకపోయింది. వేలమంది ఒక్కసారిగా వచ్చిపడడంతో పోలీసులు నిస్సహాయులయ్యారు. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించినప్పుడే ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రమాదాన్ని పసిగట్టారు. పదవికి రాజీనామా చేస్తానని, అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని ప్రకటన చేశారు. కానీ, తమ దుస్థితికి ప్రభుత్వమే కారణమని తీవ్ర ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు విక్రమసింఘే కార్యాలయం నుంచి వెలువడిన ఆ ప్రకటనను ఏమాత్రం పట్టించుకోలేదు. విక్రమసింఘే ప్రైవేటు నివాసాన్ని ముట్టడించారు.

శ్రీలంక అధ్యక్షుడు రాజీనామా చేసేందుకు అంగీకరించారని స్పీకర్ తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే జులై 13న పదవీ విరమణ చేసేందుకు అంగీకరించినట్లు పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్దన తెలిపారు. రాజపక్సే తీవ్ర ఆర్థిక సంక్షోభం మధ్య ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఎదుర్కొన్నారు. అంతకుముందు శనివారం రోజు నిరసనకారులు రాజపక్సే నివాసాన్ని చుట్టుముట్టడంతో ఆయన పారిపోయాడని నివేదికలు తెలిపాయి.

Exit mobile version