Immediate Ceasefire in Gaza: గాజాలో వెంటనే కాల్పుల విరమణ జరగాలంటూ స్పెయిన్ తీర్మానం ప్రవేశపెట్టింది. దీంతో ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వప్రతినిధి సభ ఓటింగ్‌లో భారత్ పాల్గొనలేదు. భారత్, అల్బేనియాలతోపాటు మొత్తం 19 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు అయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో సహా 12 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. గతవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇదే అంశంపై తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. దీంతో అది వీగిపోయింది. ఇప్పుడు 193 సభ్య దేశాలు కలిగిన సమితి జనరల్ అసెంబ్లీ 149 ఓట్లతో తీర్మానాన్ని ఆమోదించింది.
గాజాలో శాశ్వతంగా కాల్పులు విరమించాలని, అన్ని పక్షాలు బందీలను విడుదల చేయాలని తీర్మానం పిలుపునిచ్చింది. ఒత్తిడి చేయడం కాకుండా సంప్రదింపులు, దౌత్యం ద్వారా గాజా సమస్యను పరిష్కరించుకోవాలన్నది భారత్ అభిమతం. దీన్ని వల్ల గతంలో ఇజ్రాయెల్-పాలస్తీన సమస్యపై సమితి ఓటింగ్‌లకు దూరంగా ఉంటూ వచ్చామని, సమితిలో భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీశ్ వివరించారు.
ఇజ్రాయెల్, హమాస్‌లను దగ్గరకు తెచ్చి సంప్రదింపులకు ఒప్పించడానికి ఉమ్మడి కృషి జరగాలని కోరారు. సమితి తీర్మానం ఇజ్రాయెల్‌ను ఆక్రమణదారుగా వర్ణిస్తూ గాజా దిగ్బంధనాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం శాంతికి ఆటంకం కలిగిస్తుందన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనాలు సంప్రదింపుల వల్ల శాంతియుతంగా రెండు దేశాలుగా ఏర్పడి మనుగడ సాగించాలని భారత్ కోరుకొంటుందని పేర్కొన్నారు.