Site icon Prime9

Gaza Hospital Blast: గాజా ఆస్పత్రిపై రాకెట్ దాడి.. 500 మంది దుర్మరణం

Gaza Hospital

Gaza Hospital

Gaza Hospital Blast: సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని తాము చేయలేదని ఇజ్రాయిల్ చెబుతోంది. ఆస్పత్రిపై దాడి చేసింది తమ బలగాలేనా కాదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. దాడిలోఆస్పత్రి పరిసరాలు భీతావహంగా మారాయి. ఆస్పత్రిలోని హాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాడి ఘటనపై పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్‌ అబ్బాస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. దాడికి ముందు ఆ ఆస్పత్రిలో మూడువేల మంది శరణార్థులు ఆశ్రయంపొందుతున్నట్లు తెలుస్తోంది.

గాజాపై  వైమానిక దాడులు..(Gaza Hospital Blast)

ఉత్తర గాజాను ఖాళీ చేయాలని, తక్షణమే దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని పాలస్తీనియన్లను ఆదేశించిన ఇజ్రాయెల్‌ సైన్యం.. అదే దక్షిణ గాజాపై భారీ స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారీగా రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో పదులు సంఖ్యలో జనం మరణించారు. దక్షిణ గాజాలోని రఫా, ఖాన్‌ యూనిస్‌ నగరాల్లో ఈ దాడులు జరిగాయి. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. రఫాలో 27 మంది, ఖాన్‌ యూనిస్‌లో 30 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ మాజీ మంత్రి బసీమ్‌ నయీం చెప్పారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఉత్తర గాజాపై భూతల దాడులకు సన్నాహాలు చేస్తూ, మరోవైపు దక్షిణ గాజాపై హఠాత్తుగా వైమానిక దాడులు చేయడం గమనార్హం. హమాస్‌ స్థావరాలను, మిలిటెంట్ల మౌలిక సదుపాయాలను, కమాండ్‌ సెంటర్లను ధ్వంసం చేయడానికే దక్షిణ గాజాపై రాకెట్లు దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ రిచర్డ్‌ హెచ్ట్‌ చెప్పారు. హమాస్‌ కదలికలు ఎక్కడ కనిపించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తేనే..

మిలిటెంట్ల చేతికి దాదాపు 200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు బందీలుగా చిక్కారు. ఇజ్రాయెల్‌లోని జైళ్లలో ఉన్న 6 వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తేనే.. తమ వద్ద ఉన్న బందీలను వదిలిపెడతామంటూ హమాస్‌ ఉగ్రవాదులు ప్రకటించారు. ఇక ఇజ్రాయిల్ దాడిలో గాజాలో 2,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,700 మందికి క్షతగాత్రులుగా మారారు. మృతుల్లో మూడింట రెండొంతుల మంది చిన్నపిల్లలేనని గాజా ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి అబ్బాస్‌ తెలిపారు. గాజాలో మరో 1,200 మంది భవనాల శిథిలాల కింద చిక్కుకొని, మృతి చెందినట్లు భావిస్తున్నామని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ మరణాలు అధికారిక గణాంకాల్లో చేరలేదు. విద్యుత్, పెట్రోల్, డీజిల్‌ లేకపోవడంతో శిథిలాలను తొలగించడం సాధ్యం కావడం లేదు. ఇజ్రాయెల్‌ దళాలు భీకర స్థాయిలో దాడులు చేస్తున్నా హమాస్‌ మిలిటెంట్లు వెనక్కి తగ్గడం లేదు. గాజా నుంచి ఇజ్రాయెల్‌ భూభాగంపైకి రాకెట్లు ప్రయోగిస్తూనే ఉన్నారు. ఉత్తర గాజాపై భూతల దాడుల విషయంలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని లెఫ్టినెంట్‌ కల్నల్‌ రిచర్డ్‌ హెచ్ట్‌ వెల్లడించారు. ఉన్నత స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తమ పదాతి దళాలు అడుగు ముందుకేస్తాయని, తమ సైన్యం గాజా సరిహద్దుల్లో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

Exit mobile version