H1B employees: అమెరికాలో హెచ్1బీ వీసాలపై వెళ్లి ఉద్యోగాలు కోల్పోయిన వారికి భారీ ఊరట లభించింది. ఈ వీసాలపై ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేదా తిరిగి మాతృ దేశానికి రావాల్సి ఉంటుంది. తాజాగా అమెరికా ప్రభుత్వం ఈ గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచింది.
గ్రేస్ పీరియడ్ 180 రోజులకు పెంపు..(H1B employees)
అమెరికాలో ప్రస్తుతం అతి పెద్ద టెక్నాలజీ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేసే పనిలో పడ్డాయి. దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, మేటా , అమెజాన్, ట్విట్టర్ లాంటి కంపెనీలు గత రెండు నెలల నుంచి పెద్ద ఎత్తున లే ఆఫ్ ప్రకటించాయి. దీంతో హెచ్1బీ వీసాలపై అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేదా తిరిగి మాతృ దేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. అయితే అమెరికాలో ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు గ్రేస్ పీరియడ్ పెంచాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు.కాగా ప్రెసిడెన్షియల్ అడ్వయిజరీ సబ్ కమిటీ ఫెడరల్ ప్రభుత్వానికి హెచ్1 బీ వీసా హోల్డర్లు గ్రేస్ పీరియడ్‌ను ప్రస్తుతం ఉన్న 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలని సిఫారసు చేసింది. అజయ్ జైన్ బుటోరియా ఏషియన్ అమెరికన్ అడ్వయిజరీ సభ్యుడు ఈ విషయం చెప్పారు. హెచ్ 1 బీ వీసాలపై అమెరికా వచ్చి ఉద్యోగాలు కోల్పోయిన వారికి గ్రేస్ పిరియడ్ 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతున్నట్లు వెల్లడించారు.
ఉద్యోగాలు కోల్పోయిన హెచ్ 1బీ వీసాదార్లు 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించుకోవడం కష్టమని అజయ్ బుటోరియా కూడా చెప్పారు. అదీ కాకుండా హెచ్1బీ వీసా స్టాటస్ ట్రాన్స్‌ఫర్‌కు పెద్ద ఎత్తున పేపర్‌వర్క్ ఉంటుంది. ఈ లోగా 60 రోజుల గడువు తీరిపోతుంది. బలవంతంగా దేశం నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు బుటోరియా. కొంత గడువు ఇస్తే ఉద్యోగికి కొత్త ఉద్యోగం సంపాదించుకొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది నవంబర్ నుంచి సుమారు రెండు లక్షల ఐటి ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. వాటిలో పెద్ద కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫెస్‌బుక్, అమెజాన్‌లున్నాయని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
భారతీయులకు ప్రయోజనం..
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం హెచ్1 బీ వీసా దారులకు గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచడంతో ఎక్కువగా ప్రయోజనం పొందేది భారతీయులే. అమెరికాలోని అతి పెద్ద కంపెనీల్లో పనిచేసేది కూడా వీరే కాబట్టి ఉద్యోగం కోల్పోయిన తర్వాత 180 రోజులు అదనంగా లభిస్తుంది. కాబట్టి కొత్త ఉద్యోగం కోసం హెచ్1బీ వీసాదారుడికి కాస్తా గడువు లభిస్తుంది. కాబట్టి భారతీయ ఐటి ఉద్యోగులకు కాస్తా ఊరట లభించినట్లేనని ఐటి రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.