Prince Harry: ఫోన్ హ్యాకింగ్‌కు సంబంధించిన కేసులో సాక్ష్యం చెప్పేందుకు బ్రిటన్ కింగ్ చార్లెస్ III రెండో కొడుకు ప్రిన్స్ హ్యారీ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్ కు వ్యతిరేకంగా లండన్ హైకోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పారు. దీంతో 130 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కిన బ్రిటన్ రాజ వంశీయుడిగా హ్యారీ నిలిచారు. బ్రిటన్‌కు చెందిన మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్ సంస్థ.. వీవీఐపీల వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు చట్టవ్యతిరేక పనులు చేస్తోందంటూ ప్రిన్స్ హ్యారీతో సహా వంద మందికిపైగా ప్రముఖులు నష్ట పరిహారం కేసు వేశారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు హ్యారీ కోర్టుకు వచ్చారు.
జవాబుదారీగా ఉండేందుకే..(Prince Harry)
డైలీ మిర్రర్, సండే మిర్రర్, సండే పీపుల్ సంస్థలు 1996 నుంచి 2010 మధ్య కాలంలో ప్రైవేటు ఇన్వెస్టిగేటర్లను ఉపయోగించి తన పర్సనల్ డేటాను చోరీ చేశాయని ఆరోపించారు. అలా సేకరించిన సమాచారంతో 140 ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయన్నారు. తనపై ప్రజల్లో ద్వేషాన్ని రేకెత్తించేలా కథనాలు పబ్లిష్ చేశాయని కోర్టుకు వివరించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు తాను కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని హ్యారీ చెప్పారు.
తన భార్య మేఘన్ మార్క్లే మరియు ఇద్దరు పిల్లలు ఆర్చీ మరియు లిలిబెట్‌లతో కలిసి ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న హ్యారీ మిర్రర్ గ్రూప్ వార్తాపత్రికలు ఉపయోగించిన మోసపూరిత పద్ధతులు తన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేశాయని చెప్పాడు.హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానా వాయిస్ మెయిల్ సందేశాలను కూడా మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్ హ్యాక్ చేసి విన్నాయని హ్యారీ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.