Site icon Prime9

PM Modi : తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయండి : శ్రీలంక అధ్యక్షుడిని కోరిన ప్రధాని మోదీ

PM Modi SriLanka Visit

PM Modi SriLanka Visit

PM Modi SriLanka Visit : మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీలంకకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తమిళ జాలర్ల సమస్యను లేవనెత్తారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే వద్ద ప్రస్తావించారు. తమిళ జాలర్లను తక్షణమే విడుదల చేసి, వారి పడవలను విడిచిపెట్టాలని కోరారు. ఇరుదేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ అంశం పెండింగ్‌లో ఉంది. సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి.

 

 

కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత..
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే బాధ్యత కేంద్రానికే ఉందని ఇప్పటికే స్టాలిన్ సర్కారు పలుమార్లు వెల్లడించింది. ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన నేపథ్యంలో ఇటీవల దీనిపై అభ్యర్థనలు చేసిన సంగతి తెలిసిందే. కచ్ఛతీవు వద్ద తమిళ జాలర్లు చేపలు పట్టేందుకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తెలిపారు. తమ రాష్ట్ర మత్స్యకారులను భారతీయ జాలర్లుగా కేంద్రం చూడాలని కోరారు. కచ్ఛతీవులో చేపలు పట్టడానికి వీలుగా శ్రీలంకతో కొత్త ఒప్పందం అవసరం ఉందన్నారు. 2010 తర్వాత రెండుదేశాల మధ్య జాలర్ల అంశంపై చర్చలు జరపలేదన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని మోదీ దీనిపై అభ్యర్థన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

 

మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం ప్రదానం..
ప్రధాని మోదీకి శ్రీలంక సర్కారు అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ‘శ్రీలంక మిత్ర విభూషణ’ పురస్కారాన్ని అందజేశారు. మూడురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. థాయ్‌లాండ్‌లో బిమ్‌స్టెక్‌ సదస్సు ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్రం మోదీ నేరుగా అక్కడకు చేరకున్నారు. బండారునాయకే ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దిగగా, శ్రీలంక సర్కారు ఘనంగా స్వాగతించింది. శనివారం ఉదయం ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద అధ్యక్షుడు సంప్రదాయ పద్ధతుల్లో ఆహ్వానం పలికారు. రెండు దేశాల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాలకు ప్రతీకగా స్వాగతం నిలిచింది.

 

 

ఇరుదేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సంతకాలు చేసుకున్నారు. ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం, శ్రీలంక తూర్పు ప్రాంతానికి భారత్ గ్రాంట్ అందించడం వంటి ఒప్పందాలు జరిగాయి. ఇద్దరు నేతలు సాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించారు.

 

 

 

 

Exit mobile version
Skip to toolbar