Site icon Prime9

Prime Minister Liz Truss: లిజ్‌ ట్రస్‌ మంత్రివర్గంలో మైనార్టీలకు పెద్దపీట

Pm-Liz-Truss-Cabinet

London: బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌ మంత్రివర్గ కూర్పులో తనదైన ముద్ర వేశారు. ఇన్నాళ్లూ బోరిస్‌ జాన్సన్‌ కేబినెట్‌లో సేవలందించిన పలువురు సీనియర్లను పక్కనపెట్టారు. కొన్ని కీలక మంత్రిత్వ శాఖలను మైనార్టీ వర్గాలకు చెందిన ఎంపీలకు కట్టబెట్టారు. ప్రధాని పదవి కోసం తనతో హోరాహోరీగా తలపడిన భారత సంతతి నాయకుడు రిషి సునాక్‌కు మద్దతుగా నిలిచిన పలువురు కన్జర్వేటివ్‌ నేతలకు ట్రస్‌ మొండిచేయి చూపారు. మంత్రివర్గంలో వారికి చోటివ్వలేదు.

న్యాయ శాఖ మాజీ మంత్రి డొమినిక్‌ రాబ్‌, రవాణా శాఖ మాజీ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి స్టీవ్‌ బార్‌క్లే తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. జాన్సన్‌ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సునాక్‌కు ఈ దఫా అమాత్య పదవి దూరమైంది. భారత సంతతి మహిళా నేత సుయెలా బ్రావెర్మన్‌ హోం మంత్రిగా కీలక పదవి దక్కించుకున్నారు. భారత సంతతికే చెందిన మరో నాయకుడు అలోక్‌ శర్మ కాప్‌-26 అధ్యక్షుడిగా తన స్థానాన్ని నిలుపుకొన్నారు. భారత్‌, శ్రీలంక మూలాలున్న రణిల్‌ జయవర్దెన పర్యావరణం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు. ఉప ప్రధానమంత్రిగా థెరెసె కొఫే, విదేశాంగ మంత్రిగా జేమ్స్‌ క్లెవెర్లీ, అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా కెమీ బడెనోచ్‌లను ట్రస్‌ నియమించారు.

ట్రస్‌ సునాక్‌ల మధ్య జరిగిన పోరు సమయంలో రిష్‌ ఒక వేళ తాను ప్రధానమంత్రి రేసులో ఓడిపోతే ట్రస్‌ మంత్రివర్గంలో చేరనని స్పష్టం చేశారు. అయితే తన నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తానని ఇంతకు ముందే తెలిపారు. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ ఆర్‌ నారాయణమూర్తి అల్లుడు అయిన సునాక్‌ దాదాపు 50 వేల మందికి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు ఇప్పించినట్లు లండన్‌ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

Exit mobile version
Skip to toolbar