Great Wall Of China: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ ఆ దేశానికి ప్రహారి గోడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వారికి తొట్టతొలి గుర్తింపు సాధించిన చారిత్రాత్మక కట్టడం కూడా. అలాంటిది రాకపోకలకు అడ్డంగా ఉందని ఈ గోడకు ఏర్పడ్డ చిన్న సందుని పెద్దది చేసే ప్రయత్నంలో భారీగా తవ్వేశారు ఇద్దరు ఆగంతకులు.
యంత్ర సామాగ్రిని తరలించడానికి..(Great Wall Of China)
చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లో, యూయు కౌంటీ సమీపంలోని యాంగ్‌క్యాన్హె టౌన్‌షిప్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ ఇక్కడికి సమీపంలో ఒక నిర్మాణ కాంట్రాక్టును తీసుకున్నారు. అయితే వారి రాకపోకలకు అడ్డంకిగా నిలవడంతో పాటు యంత్ర సామాగ్రిని నిర్మాణ స్థలానికి తరలించడానికి గ్రేట్ వాల్ అడ్డుగా ఉంది. దీనివలన వారు పని చేసుకునే చోటికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీంతో వారిద్దరు కలిసి యంత్రాల సాయంతో గ్రేట్‌వాల్‌ను కొంతవరకు కూల్చేశారు.
ఆగస్టు 24న స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కూల్చేసిన గోడను చూసి షాక్ అవుతున్నారు. కేవలం షార్ట్‌కట్‌గా ఉపయోగపడుతుందన్న ఒకేఒక్క కారణంతో నిందితులు చైనా ప్రతిష్టకు ప్రతీకగా నిలిచిన భారీ గోడ సమగ్రతకు సుస్థిరతకు తీవ్రనష్టం కలిగించారన్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. ఇదిలా ఉండగాగ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం క్రీస్తుపూర్వం 200లోనే ప్రారంభమైనప్పటికీ ఇప్పుడున్న కట్టడాన్ని నిర్మించింది మాత్రం మింగ్ వంశీయులే. క్రీస్తుశకం 1368-1644 సమయంలో దీని నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక కట్టడమైన ఈ గోడను యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. ఈ చారిత్రక కట్టడాన్ని చూసేందుకు నేటికీ ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి తరలివస్తుంటారు.