Pakistan plane seized: పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) కు చెందిన బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌ను మలేషియాలోని కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జప్తు చేసుకున్నారని పాకిస్తాన్‌కు చెందిన ఎఆర్‌వై న్యూస్ మంగళవారం నాడు వెల్లడించింది. ఇక అసలు విషయానికి వస్తే బోయింగ్ 777 విమానాన్ని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) మలేషియా నుంచి లీజుకు తీసుకుంది. కాగా ఈ విమానం బీఎంహెచ్ రిజిస్ర్టేషనల్ నంబరు కలిగి ఉంది. కాగా పీఐఏ మలేషియాకు లీజు సొమ్ము సుమారు నాలుగు మిలియన్ డాలర్లు బకాయి పడింది. డబ్బు చెల్లించాలని నోటీసులు పంపినా పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో విమానాన్ని కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులోనే సీజ్ చేసింది. ఇలా విమానాన్ని సీజ్ చేయడం ఇది రెండవసారి.
ఆర్థిక సంక్షోభంలో పీఐఏ.. (Pakistan plane seized)
కాగా విమానాన్ని లీజుకు ఇచ్చిన కంపెనీ విమానాన్ని సీజ్ చేయడానికి ముందు మలేషియా కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకుంది. కాగా పీఐఏ అధికార ప్రతినిధి అబ్దుల్ హఫీజ్‌ఖాన్ ఒక ప్రకటనలో స్పందిస్తూ.. తాము చట్ట ప్రకారం ముందుకు పోయి విమానాన్ని విడిపించుకుంటామని చెప్పారు. లీజుకు ఇచ్చిన సంస్థ చెబుతున్నట్లు నాలుగు మిలియన్ డాలర్లు తాము ఎప్పుడో చెల్లించామని ఆయన చెబుతున్నారు. పీఐఏ పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ 2020 నుంచి పాకిస్తాన్ విమానాలను యూరోప్‌లోకి అడుగు పెట్టనివ్వడం లేదు. పాకిస్తాన్‌లో ఫేక్ పైలట్ లైసెన్సులు దక్కించుకుని విమానాలు నడుపుతున్నారని తేలింది. రెండేళ్ల క్రితం ఫేక్ పైలట్ లైసెన్స్‌ల అంశం పాకిస్తాన్‌లో పెద్ద దుమారమే చెలరేగింది.
ఇదిలా ఉండగా గత రెండు సంవత్సరాల నుంచి పీఐఏ విమానాలు జప్తు కావడం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం ఇదే కౌలాలంపూర్ విమానాశ్రయంలో పీఐఏ విమానాన్ని సీజ్ చేశారు. 2021లో కూడా లీజు బకాయిలు చెల్లించలేదని విమానాన్ని జప్తు చేశారు. అటు తర్వాత మలేషియాలో పాకిస్తాన్ రాయబారి దౌత్యపరంగా జరిపిన చర్చల తర్వాత విమానాన్ని విడుదల చేశారు. అటు తర్వాత తిరిగి విమానాన్ని జనవరి 27వ తేదీన పాకిస్తాన్‌కు తీసుకువచ్చారు. 173 మంది ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందితో కలిసి జప్తు చేసుకున్న విమానంలో స్వదేశానికి చేరుకున్నారు.