Afghanistan Earthquake: పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం, బలమైన ప్రకంపనల కారణంగా 2,000 మందికి పైగా మరణించారని తాలిబాన్ ప్రతినిధి ఆదివారం తెలిపారు. రెండు దశాబ్దాల్లో దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలలో ఇది ఒకటి.
వందలాది ఇళ్లు ధ్వంసం..(Afghanistan Earthquake)
హెరాత్‌లో సంభవించిన భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య మొదట నివేదించిన దానికంటే ఎక్కువగా ఉందని సమాచార మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రేయాన్ తెలిపారు. దాదాపు ఆరు గ్రామాలు ధ్వంసమయ్యాయని, వందలాది మంది పౌరులు శిథిలాల కింద సమాధి అయ్యారని తెలిపారు. ఈ భూకంపం కారణంగా 465 ఇళ్లు ధ్వంసమయ్యాయని, మరో 135 దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి 12 అంబులెన్స్ కార్లను జెండా జాన్‌కు పంపినట్లు తెలిపింది.
శనివారం మధ్యాహ్నం 12గంటల 11 నిమిషాలకు తొలి భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైంది. తుర్క్‌మెనిస్థాన్‌లోని అస్గాబట్ నగరానికి ఆగ్నేయంగా 471 కిలో మీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఆ తర్వాత 8 నిమిషాలకే అంటే 12 గంటల 19 నిమిషాలకు మరోసారి భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ఆ తర్వాత 23 నిమిషాల వ్యవధి తర్వాత అంటే 12 గంటల 42 నిమిషాలకు మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. అస్గాబట్ నగరానికి ఆగ్నేయంగా 428 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 34 కిలోమీటర్ల లోతుతో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.