Palestinian State: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడం.. ప్రతీకారంగా ఇజ్రాయెల్ హమాస్‌ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. గాజాను నేల మట్టం చేసింది. అయితే తాజా పరిణామాల విషయానికి వస్తే ప్రపంచంలోని పలు దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడానికి ముందుకు వచ్చాయి. వారిలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాలు ప్రముఖంగా ఉన్నాయి. ఇక నార్వే విషయానికి వస్తే పాలస్తీనాను స్వతంత్రదేశంగా గుర్తించడానికి అంగీకరించింది. దీనికి ప్రధాన కారణం ఇజ్రాయెల్‌తో శాంతి కుదురుతుందనే ఉద్దేశమని ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరే బుధవారం చెప్పారు. కాగా ఐర్లాండ్‌తో పాటు స్పెయిన్ కూడా పాలస్తీనాను బుధవారం నాడే గుర్తించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
143 దేశాల అంగీకారం..(Palestinian State)
ఇదిలా ఉండగా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలైన స్లోవేనియా, మాల్టాలు కూడా పాలస్తీనాను గుర్తిస్తామని ఇటీవలే ప్రకటించాయి. ప్రస్తుతం శాంతి నెలకొనాలంటే రెండు దేశాలను గుర్తించడం అత్యవసమని ఈ రెండు దేశాలు తెలిపాయి. ఇజ్రాయెల్, గాజాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది మృతి చెందగా… అదే స్థాయిలో గాయపడ్డారు. వీరిలో ఎక్కువగా మహిళలు, పిల్లలున్నారు. ఇదిలా ఉండగా ఐక్యరాజ్యసమితిలో మొత్తం 193 సభ్య దేశాలకు గాను 143 దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి అంగీకరించాయి.
ఫ్రాన్స్ నిరాకరణ..
ఇక యూరోపియన్ దేశాల విషయానికి వస్తే కొన్ని దేశాలు ఉదాహరణకు స్వీడెన్ దశాబ్దం కిత్రమే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించింది. ఇక ఫ్రాన్స్ విషయానికి వస్తే తక్షణమే గుర్తించడానికి నిరాకరించింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనే వరకు వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. అయితే అకస్మాత్తుగా పాలస్తీనాను ఓ దేశం గుర్తించడానికి ప్రధాన కారణం. ఈ నెలలోనే దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. దీంతో పాటు ఉత్తర గాజాపై కూడా దాడులను ముమ్మరం చేసింది. దీంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా వచ్చిన వారికి సాయం అందించడం కూడా కష్టంగా మారుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి ఏర్పుడుతుందని యూఎన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక నాన్ ఈయు దేశాల విషయానికి వస్తే నార్వే కూడా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి అంగీకరించింది.