Site icon Prime9

Nobel Peace Prize: ఇరాన్ మహిళ నర్గీస్ మహ్మదీకి నోబెల్‌ శాంతి బహుమతి

Nobel Peace Prize

Nobel Peace Prize

Nobel Peace Prize:ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ శాంతి బహుమతి ఇరాన్‌ మహిళ నర్గీస్‌ మహ్మదీ దక్కించుకున్నారు. ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న నర్గీస్‌ ఇరాన్‌లో అణిచివేయబడుతున్న మహిళలకు తరపున మానవ హక్కులకోసం.. ప్రతి ఒక్కరికి స్వేచ్చ కోసం ఆమె పోరాడుతున్నారు.

13 సార్లు అరెస్ట్ ..(Nobel Peace Prize)

అత్యంత ధైర్యవంతురాలైన నర్గీస్‌ మహ్మదీ వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇరానీయన్‌ ప్రభుత్వం ఆమెను ఇప్పటి వరకు 13 సార్లు అరెస్టు చేసింది. ఐదు సార్లు శిక్షలు విధించింది. మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు 154 కొరఢా దెబ్బలు తినాల్సి వచ్చింది. ఇప్పటికి ఆమె ఇరాన్‌ జైల్లోనే మగ్గుతున్నారని నార్వే నోబెల్‌ కమిటి వెల్లడించింది. ఇరాన్‌లోని జంజాన్‌లో పుట్టిన ఆమె ఇమామ్‌ ఖోమేనీ ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీలో విద్యను అభ్యసించారు. ఫిజిక్స్‌లో ఆమె డిగ్రీ పూర్తి చేశారు. ఆమె కాలేజీ రోజుల్లోనే మహిళలకు సమాన హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు. యూనివర్శటి విద్య పూర్తి అయిన తర్వాత ఆమె ఇంజినీర్‌గా పనిచేశారు. దీనితో పాటు ఆమె మహిళా హక్కులకు అనుకూలంగా ఉండే న్యూస్‌ పేపర్స్‌లో వ్యాసాలు రాసేవారు.

2003 నుంచి ఆమె టెహరాన్‌లో మానవ హక్కుల సెంటర్‌లో కీలకపాత్ర పోషించడం ప్రారంభించారు. కాగా ఈ సంస్థను నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత శిరిన్‌ ఇబాతి స్థాపించారు. మహిళల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటంలో నర్గీస్‌ కూడా పాలుపంచుకున్నారు. ఇదిలా ఉండగా 2011లో నర్గీస్‌ను మొట్టమొదటిసారి పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలల పాటు ఆమెను జైల్లో ఉంచారు. ఆమె చేసిన తప్పల్లా మానవ హక్కుల కోసం పోరాడి జైల్లో మగ్గుతున్న కుటుంబాలను ఆదుకోవడమే. 2013లో ఆమెకు బెయిల్‌ దక్కింది. అటు తర్వాత ఆమె ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశారు . మరణ శిక్ష రద్దు చేయాలని ఆమె పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో ఇరాన్‌ ప్రభుత్వం ఆమెను 2016లో అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన ఆమెను అదనంగా మరి కొన్ని సంవత్సరాల పాటు జైలులో నిర్బంధించింది.

Exit mobile version