Nepal: నేపాల్‌లోని లుంబినీ ప్రావిన్స్‌లో ఉన్న రప్తి నదిలో శుక్రవారం ప్రయాణీకుల బస్సు పడిపోవడంతో ఇద్దరు భారతీయులతో సహా కనీసం 12 మంది మరణించారు. ఖాట్మండు పోస్ట్ ప్రకారం, బస్సు నేపాల్‌గంజ్ నుండి ఖాట్మండుకు వెళుతుండగా, భలుబాంగ్‌లోని రప్తి వంతెనపై నుండి ఈస్ట్-వెస్ట్ హైవే వెంబడి నదిలోకి పడిపోయింది.
ఐదుగురు ప్రయాణికులు చికిత్స పొందుతూ మరణించగా, మరో ఏడుగురి మృతదేహాలను ప్రమాదం స్థలం నుండి వెలికి తీశారు. భారతీయ పౌరులను మునే (31), యోగేంద్ర రామ్ జోగేంద్ర (67)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో 23 మంది గాయపడ్డారు, వారిలో ఎనిమిది మందిని చికిత్స కోసం కొల్హాపూర్‌లోని నేపాల్‌గంజ్ మెడికల్ టీచింగ్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు భారతీయులు కొల్హాపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుందర్ తివారీ తెలిపారు.గాయపడిన ఏడుగురిని బుట్వాల్‌కు తరలించగా, మరో ఇద్దరు భలుబాంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ లాల్ బహదూర్ నేపాలీ (28)ని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో, ఖాట్మండు సమీపంలోని మకవాన్‌పూర్ జిల్లాలో రోడ్డుపై వాహనం బోల్తా పడడంతో కనీసం 12 మంది భారతీయ పౌరులు మరియు నేపాల్ డ్రైవర్ గాయపడ్డారు. వాహనం దక్షిణ నేపాల్ పట్టణమైన బిర్‌గంజ్ నుండి ఖాట్మండు వైపు వెళుతోంది. జిల్లాలోని మతతీర్థ ప్రాంతానికి సమీపంలోని ఇంద్రసరోవర్ రూరల్ మునిసిపాలిటీ వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదానికి గురయింది.