Rupert Murdoch:ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 92 ఏండ్ల వయసులో ఐదో పెండ్లికి సిద్ధమవుతున్నారు. తన ప్రియురాలు అయిన 65 ఏళ్ల యాన్ లెస్లీ స్మిత్ ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 17న న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మళ్లీ ప్రేమలో పడ్డాను. ఇదే నా చివరి వివాహం అవుతుందని నాకు తెలుసు’ అని రూపర్ట్ మర్దోక్ వెల్లడించారు. నాలుగో భార్య అయిన జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకుని ఏడు నెలలు కూడా పూర్తికాకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ముర్దోక్.
లెస్లీ స్మిత్ కు రెండవ వివాహం..(Rupert Murdoch)
మరోవైపు లెస్లీ స్మిత్ భర్త కూడా ఓ వ్యాపారవేత్తనే. 14 ఏళ్ల క్రితమే ఆయన చనిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న లెస్లీ.. మర్దోక్ చేసిన పెండ్లి ప్రతిపాదనకు అంగీకారించింది. ఆయనతో జీవితం పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.. మర్దోక్ మొదటిసారి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ పాట్రీషియా బుకర్‌ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరు 1967 వరకు కలిసే ఉన్నారు. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత అన్నా మరియా మన్ ను వివాహం చేసుకుని.. 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత వెండీ డెంగ్ ని పెళ్లిచేసుకుని.. 2013 వరకూ కాపురం చేశారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత 2016లో జెర్రీ హాల్ (65)ను నాలుగో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన.. ఆరేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఐదోసారి లెస్లీ స్మిత్‌తో వివాహానికి సిద్ధమయ్యారు.
రెండవ భార్యకు ఖరీదైన భరణం..
కాగా, రెండో భార్య అన్నా మరియా మన్ నుంచి విడిపోయిన సందర్భంలో మర్దోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైనవాటిల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. మర్దోక్, స్మిత్‌ల వివాహం ఈ వేసవిలో జరగనుండగా.. అమెరికా, బ్రిటన్‌లో శేష జీవితం గడపాలని కొత్త జంట భావిస్తోందని వార్తలు వస్తున్నాయి.