Hong Kong: అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో నేర్పరిగా పేరున్న రెమీ లుసిడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్ సాహసికుడికి ప్రమాదాలతో చెలగాటమాడటం సరదా. తాజాగా ఓ సాహసం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. హాంకాంగ్‌లోని ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్‌ను అధిరోహించాలని ప్రయత్నించి లుసిడి మరణించాడు. కింద పడిపోవడానికి ముందు ఈ భవనం 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్ కిటికిబయట చిక్కుకుపోయాడు. దీంతో భయంతో ఆ కిటికీని బలంగా తన్నాడు. అతడిని కిటికి బయట చూసిన ఆ పెంట్‌హౌస్‌లోని పనిమనిషి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అతడి కాలు అక్కడి నుంచి పట్టుతప్పింది. దీంతో నేరుగా కిందపడిపోవడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఉదయాన్నే వచ్చి..( Hong Kong)
హాంకాంగ్ అధికారుల కథనం ప్రకారం.. లుసిడి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో భవనం సెక్యూరిటీ వద్దకు వచ్చాడు. 40వ అంతస్తులో తన మిత్రుడు ఉన్నాడని చెప్పి లోపలకు వెళ్లిపోయాడు. కానీ, 40వ అంతస్తులో సదరు వ్యక్తి.. లుసిడి ఎవరో తనకు తెలియదని సెక్యూరిటీకి చెప్పాడు. అప్పటికే లుసిడి ఎలివేటర్‌లో పైకి వెళ్లడం మొదలుపెట్టాడు. అతడు 49వ ఫ్లోర్ నుంచి మెట్ల మార్గంలో పైకి వెళ్లినట్లు అక్కడి వారు చెబుతున్నారు. కానీ, భవనం పైకప్పుపై మాత్రం కనిపించలేదని పేర్కొన్నారు. ఉదయం 7.38 సమయంలో అతడిని పెంట్‌హౌస్‌లో పనిమనిషి చూసి పోలీసులకు కాల్ చేసింది. అనంతరం అతడు పట్టుతప్పి కిందపడిపోయాడు. అతడు బ్యాలెన్స్ తప్పడంతో సాయం కోసం కిటీకిని తన్ని ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లుసిడి కెమెరాను స్వాధీనం చేసుకొన్నారు.