Jack Ma: దాదాపు గత మూడేళ్లుగా చాలా అరుదుగా బయట కనిపిస్తున్న చైనాకు చెందిన కుబేరుడు, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా చాలా రోజుల తర్వాత స్వదేశంలో ప్రత్యక్షమయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో గడిపిన ఆయన తాజాగా చైనాలో అడుగుపెట్టారు. చైనా హాంగ్ జా లో తాను స్థాపించిన స్కూల్‌కు హాజరైనట్లు వార్తలు వెలువడ్డాయి. జాక్ మా రాకతో హాంకాంగ్ మార్కెట్‌లో అలీబాబా షేర్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి.
అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. 2020లో అక్కడి ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించి చిక్కుల్లో పడ్డారు. ఆ తర్వాత అతడి కంపెనీలపై ప్రభుత్వ పెద్దలు ఉక్కుపాదం మోపారు. దీంతో 2021 చివర్లో ఆయన చైనాను వీడారు. ఆ తర్వాత జాక్ మా బహిరంగంగా కనిపించిన సందర్భాలు చాలా అరుదు. జపాన్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ లాంటి దేశాల్లో అప్పుడప్పుడూ ప్రత్యక్షమైన ఫొటోలు మాత్రం కనిపించాయి.
4 శాతం పెరిగిన కంపెనీ షేర్లు(Jack Ma)
అలా దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో ఉంటున్న జాక్‌మా తాజాగా చైనాలో అడుగుపెట్టారు. హంగ్జౌ నగరంలో ఆయన స్థాపించిన ఓ స్కూల్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం బయటకొచ్చాయి. చైనా వచ్చే ముందు ఆయన హాంకాంగ్‌లో పర్యటించారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. జాక్‌మా రాకతో హాంకాంగ్ మార్కెట్‌లో అలీబాబా కంపెనీ షేర్లు 4 శాతం మేర పెరిగాయి. అయితే, జాక్‌మా రాకను చైనాలో మళ్లీ ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పడానికి సంకేతంగా భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. చైనాలో రెండేళ్ల క్రితం వరకు జాక్ మా అత్యంత ధనవంతుడు. ఈ ఏడాది జనవరిలో ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం యాంట్ గ్రూప్ నియంత్రణను వదులుకున్నాడు.