Prime9

Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. ఖమేనీ సన్నిహిత సలహాదారు అలీ షాద్మానీ మృతి!

Israel-Iran War Updates: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ దేశాల మధ్య యుద్ధం ఐదోరోజూ కొనసాగుతోంది. టెహ్రాన్‌పై టెల్‌అవీవ్‌ చేసిన దాడుల్లో ఇరాన్‌ సీనియర్-మోస్ట్ మిలిటరీ అధికారి, ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహిత సైనిక సలహాదారు అలీ షాద్మానీ దుర్మరణం చెందినట్లు ఇజ్రాయెల్‌ దళాలు వెల్లడించాయి. అలీ షాద్మానీ సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ ప్రదేశంలో తలదాచుకున్నట్లు తమకు వచ్చిన సమాచారంతో దాడులు జరిపినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ చేస్తున్న పలు క్షిపణి దాడులకు అలీ నేతృత్వం వహించారని తెలిపింది.

 

ఆపరేషన్‌ ‘రైజింగ్‌ లయన్‌’ పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో రాన్‌ సీనియర్ మిలిటరీ అధికారి అలీరషీద్ మృతిచెందాడు. దీంతో అలీ షాద్మానీని ఖమేనీ ఇటీవల సాయుధ దళాలకు కొత్త నాయకుడిగా నియమించారు. అంతకుముందు షాద్మానీ అల్-అన్బియా అత్యవసర కమాండ్ సెంటర్ డిప్యూటీ కమాండర్‌గా, ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఫోరంలో ఆపరేషన్స్ డైరెక్టరేట్ అధిపతిగా విధులు నిర్వహించాడు. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులు చేస్తోంది. మంగళవారం 20 బాలిస్టిక్ క్షిపణులను టెల్‌అవీవ్‌పై ప్రయోగించింది. దీంతో భారీ నష్టం సంభవించినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. భవనాలు, వాహనాలపై క్షిపణులు పడగా, మంటలు ఎగసిపడుతున్నట్లు తెలిపింది.

 

రెండుదేశాల మధ్య యుద్ధం మొదలు కాగా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు పలువురు ఇరాన్‌ కీలక నేతలు మృతిచెందారు. ఇరాన్‌‌కు చెందిన సాయుధ దళాల జనరల్‌ స్టాఫ్‌ నిఘా డిప్యూటీ జనరల్‌ ఘోలామ్రేజా మెహ్రాబీ, ఆపరేషన్‌ డిప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీ, ఇరానియన్‌ రెవల్యూషనరీ గార్డు కోర్‌ (ఐఆర్‌జీసీ) చీఫ్‌ మేజర్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీ, సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్‌ మహమ్మద్‌ బాఘేరి, దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి జనరల్‌ అమీర్‌అలీ హాజీజదే, పలువురు అణుశాస్త్రవేత్తలు దుర్మరణం చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

 

యుద్ధం విషయంలో సోమవారం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీని హతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. దీంతో టెల్‌అవీవ్‌ టెహ్రాన్‌లోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

Exit mobile version
Skip to toolbar