Site icon Prime9

Israel-Hamas: పశ్చిమాసియాలో కీలక పరిణామం.. ఎట్టకేలకు ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కుదిరిన ఒప్పందం

Israel, Hamas Reach  Agreement To End Gaza War: పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో శాంతి స్థాపన కోసం ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు సంబంధించి మధ్యవర్తులకు తమ ప్రతినిధి బృందం అంగీకారం తెలిపిందని హమాస్‌ పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్త ఏజెన్సీ రాయిటర్స్‌ పేర్కొంది. దీంతో 15 నెలలుగా జరుగుతున్న భీకర పోరాటానికి ముగింపు పలికినట్లైంది. కాగా, ఈ ఒప్పందం దాదాపు 6 వారాల పాటు అమలులో ఉంటుంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌ బలగాలు గాజాను క్రమంగా వీడుతాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్‌ మధ్యవర్తిత్వం వహించింది. కొన్నినెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్‌ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది.
హమాస్‌పై ఇజ్రాయెల్‌ భీకరంగా..
కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన వేళ ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి గిడియాన్‌ సార్‌ తన యూరప్‌ పర్యటనను మధ్యలోనే తగ్గించుకొని సెక్యూరిటీ కేబినెట్‌ సమావేశంలో పాల్గొనేందుకు స్వదేశానికి బయలుదేరారు. అంతకుముందు ఇజ్రాయెల్‌పై హమాస్‌ 2023 అక్టోబర్‌ 7న మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో సుమారు 1200 మందికి పైగా ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోయారు. దీంతో పాటు మరో 250 మందిని హమాస్‌ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే హమాస్‌పై ఇజ్రాయెల్‌ భీకరంగా దాడులు చేసేందుకు విరుచుకుపడింది. అనంతరం హమాస్‌ అగ్రనేత ఇస్మాయెల్‌ హనియాను మట్టికరిపించింది. అంతేకాకుండా అక్టోబర్‌ 7న జరిగిన నాటి ఘటనకు సూత్రధారి అయిన యహ్యా సిన్వార్‌తోపాటు ఇతరు కీలక నేతలను హతమార్చింది. గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో దాదాపు 46వేల మందికిపైగానే పాలస్తానీయులు మృతిచెందినట్లు సమాచారం.

Exit mobile version
Skip to toolbar