Hinduja Family Trail: బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల్లో అగ్రస్థానంలో నిలిచింది హిందూజా కుటుంబం. ఇండియాకు చెందిన వీరు బ్రిటన్‌లో స్థిరపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వీరికి వ్యాపారాలున్నాయి. అయితే ఇటీవల హిందూజా గ్రూపుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. కోర్టులో విచారణ కూడా సాగుతోంది. గ్రూపునకు చెందిన ఉద్యోగులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా బిలియనీర్ హిందూజా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు మానవ అక్రమ రవాణా కేసును ఎదుర్కొంటున్నారు. లేక్ జెనీవాలో వారి విల్లాలో పనిచేసే సిబ్బంది తో శ్రమ దోపిడికి పాల్పడ్డారని, వారి పాస్‌పోర్టులు జప్తు చేసుకొని రోజుకు 15 నుంచి 18 గంటల పాటు పనిచేయించుకొని కేవలం 8 డాలర్లు మాత్రమే వేతనం చెల్లిస్తున్నారంటూ వీరిపై కేసు కూడా నమోదైంది.
మానవ అక్రమ రవాణా కేసు..(Hinduja Family Trail)
స్విట్జర్లాండ్‌లో ప్రకాశ్ హిందూజా, కమల్ హిందూజా, వారి కుమారుడు అజయ్, భార్య నమ్రతాలపై మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. తర్వాత వీరు ఉద్యోగులతో రాజీకి రావడంతో సివిల్ కేసు ఉపసంహరించుకున్నారని బ్లూమ్‌బర్గ్ తాజాగా ఓ నివేదికలో వెల్లడించింది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం వీరిని ఐదు నుంచి ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించాలని కోర్టును కోరారు. ఉద్యోగులతో హిందూజాల సెటిల్మెంట్ వివరాలు మాత్రం తెలియరాలేదు. గత శుక్రవారం నాడు ఇరు వర్గాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. వాస్తవానికి హిందూజాల వద్ద పనిచేసే సిబ్బంది ఆరు సంవత్సరాల క్రితం సివిల్ సూట్ వేశారు. స్థానికంగా ఇచ్చే వేతనాలతో పోల్చుకుంటే అతి తక్కువ వేతనాలతో పాటు చట్టవ్యతిరేకంగా ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్నారని విల్లాలో పనిచేసే ఉద్యోగుల ప్రధాన ఆరోపణ.
పెంపుడు కుక్కల ఖర్చు కన్నా తక్కువ..
బ్లూమ్‌బర్గ్ సమాచారం ప్రకారం స్విస్ ప్రాసిక్యూటర్ వైవ్స్ బెర్టోసా హిందూజాల అఘాయిత్యాల గురించి వివరించాడు. వారి ఇంట్లో పనిచేసే సిబ్బంది పాస్‌పోర్ట్ జప్తు చేసుకోవడంతో పాటు వారి కదలికలపై కూడా ఆంక్షలు విధించారు . ఉద్యోగులకు అతి తక్కువ వేతనం 7.84 డాలర్లు చెల్లించేవారు. స్విట్జర్లాండ్‌లో తమ పెంపుడు కుక్కలకు ఖర్చు చేసే డబ్బుతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. స్విట్జర్లాండ్‌లో పెంపుడుకుక్కలపై ఏడాదికి 8,584 స్విస్ ప్రాంక్‌లు ఖర్చు చేస్తారు. డాలర్ కంటే స్విస్ ఫ్రాంక్ రేటు కూడా కాస్తా ఎక్కువే. అయితే హిందూజా లాయర్లు మాత్రం ఇంట్లో పనివారితో 18 గంటల పాటు పనిచేయించుకోవడం అనేది అవాస్తవమంటున్నారు. ఇక అజయ్ హిందూజా మాత్రం తనకు ఇంట్లో పనిచేసే స్టాఫ్ గురించి వారి వర్కింగ్ కండిషన్స్ గురించి తెలియదు. ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ను హిందూజా గ్రూపు ఇండియా చూసుకుంటుందని చేతులు దులుపుకున్నారు.
అయితే స్విస్ ప్రాసిక్యూటర్ మాత్రం హిందూజాల నుంచి కోర్టు ఖర్చుల కింది మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు… ఉద్యోగుల పరిహారం కింద 3.5 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన హిందూజాలు ఉద్యోగుల జీతభత్యాల దగ్గరికి వచ్చే సరికి పిసినారి తనంగా వ్యవహరించడం ప్రస్తుతం ప్రపంచ బిలియనీర్లలో హాట్ టాపిక్‌గా మారింది.